Crime Against Women: 2020తో పోలిస్తే 2021లో మహిళలపై దాడులు 30 శాతం పెరిగినట్లు జాతీయ మహిళా కమీషన్- ఎన్సీడబ్ల్యూ వెల్లడించింది. 2021లో మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి 30 వేల 864 ఫిర్యాదులు అందాయన్న ఎన్సీడబ్ల్యూ.. 2014 తర్వాత ఇదే అత్యధికమని పేర్కొంది. వీటిలో 11 వేల ఫిర్యాదులు మానసిక వేధింపులకు సంబంధించినవి కాగా.. 6,633 గృహ హింస, 4,589 వరకట్న వేధింపులపై వచ్చినట్లు మహిళా కమీషన్ తన నివేదికలో వెల్లడించింది.
Highest Number of Complaints from UP: మహిళలపై జరిగిన దాడులకు సంబంధించి ఒక్క ఉత్తర్‌ప్రదేశ్ నుంచే 15 వేల 828 ఫిర్యాదులు అందినట్లు జాతీయ మహిళా కమీషన్ తెలిపింది. దిల్లీ నుంచి 3,336, మహారాష్ట్ర నుంచి 1504, హరియాణా, బిహార్ నుంచి చెరో 14 వందలకు పైగా ఫిర్యాదులు అందినట్లు చెప్పింది. మహిళలు తమపై జరుగుతున్న దాడులను ప్రతిఘటించేలా వారిలో చైతన్యం కల్పిస్తుండటం వల్లే ఈ ఏడాది ఫిర్యాదుల సంఖ్య భారీగా పెరిగినట్లు జాతీయ మహిళా కమీషన్ ఛైర్మన్ రేఖా శర్మ చెప్పారు. బాధిత మహిళలను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.