తెలంగాణ

telangana

ETV Bharat / bharat

38 వర్సెస్​ 26.. పోటాపోటీగా NDA, విపక్ష కూటమి భేటీలు.. 2024లో గెలుపే టార్గెట్​!

NDA Meeting : ఎన్​డీఏపై ఉమ్మడి పోరుకు సిద్ధమైన 26 విపక్షాలకు దీటుగా జాతీయ ప్రజాస్వామ్య కూటమిని బలోపేతం చేయడంపై దృష్టిపెట్టింది భారతీయ జనతా పార్టీ. ఏకంగా 38 పార్టీలను ఎన్​డీఏ గూటికి చేర్చడంలో సఫలమైంది! మంగళవారం జరిగే కూటమి భాగస్వామ్యపక్షాల సమావేశానికి ఆయా పార్టీల నేతలంతా హాజరుకానున్నారని తెలిపింది. దిల్లీ వేదికగా జరిగే ఈ భేటీలో.. 2024 లోక్‌సభ ఎన్నికలకు కమలదళం శంఖం పూరించనుంది.

NDA Meeting 2023
NDA Meeting 2023

By

Published : Jul 17, 2023, 7:26 PM IST

NDA Meeting 2023 : ఐక్యత పేరుతో ప్రతిపక్షాలు సమావేశాలు నిర్వహిస్తున్న వేళ దిల్లీ వేదికగా తమ బలాన్ని ప్రదర్శించేందుకు బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్​డీఏ) సిద్ధమైంది. మంగళవారం జరగనున్న ఎన్​డీఏ సమావేశంలో ప్రస్తుతం కూటమిలో ఉన్న పార్టీలతో పాటు కొత్త భాగస్వామ్యులు కూడా హాజరుకానున్నారు. ఈ మేరకు గతంలో ఎన్​డీఏ నుంచి వైదొలిగిన వారిని సైతం తిరిగి కూటమిలోకి తీసుకొచ్చేందుకు ఇటీవల బీజేపీఅనేక ప్రయత్నాలు చేసింది. దిల్లీలో జరగనున్న ఎన్​డీఏ సమావేశం ద్వారా 2024 ఎన్నికల ప్రచారాన్ని కమలదళం ప్రారంభించనుందని సమాచారం. తనతో పాటు భాగస్వామ్య పార్టీలను తీసుకెళ్లడంలో బీజేపీ విఫలమవుతోందని విమర్శలు వినిపిస్తున్న వేళ దిల్లీలో జరగనున్న ఎన్​డీఏ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశానికి 38 పార్టీల నేతలు హాజరుకానున్నారని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు.

"ప్రధాని మోదీ నాయకత్వంలో గత 9 ఏళ్లలో భారత్ ఎంతో అభివృద్ధి చెందింది. ఎన్​డీఏ ప్రజాసేవ కోసం పని చేస్తోంది. అధికారం కోసం కాదు. యూపీఏ పదేళ్ల పాలన అవినీతిమయం. అందుకే ప్రజలు బీజేపీకి మద్దతు తెలిపారు. ఇప్పుడు కూడా 2024లో మరోసారి మోదీ నేతృత్వంలోని బీజేపీ అధికారంలోకి వస్తుంది."

--జేపీ నడ్డా, బీజేపీ అధ్యక్షుడు

అజిత్​ పవార్​ వర్గంతోనూ దోస్తీ..
బిహార్ సీఎం నేతృత్వంలోని జేడీయూ, ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన, అకాలీ దళ్ వంటి పార్టీలు బీజేపీతో విభేదించి ఎన్​డీఏ నుంచి వైదొలిగాయి. అనంతరం ఏక్‌నాథ్ శిందే నేతృత్వంలోని శివసేనను ఎన్​డీఏ గొడుగు కిందకు తెచ్చిన కమలదళం, ఎన్​సీపీ తిరుగుబాటు నేత అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్​సీపీతో ఇటీవల జతకట్టింది. తాజాగా ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన ఎస్​బీఎస్​పీ నాయకుడు ఓం ప్రకాశ్‌ రాజ్‌భర్‌ సహా.. బిహార్‌ మాజీ సీఎం జితన్‌రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్థానీ అవామీ మోర్చా సెక్యూలర్ పార్టీతోనూ చేతులు కలిపింది. ఉపేంద్ర కుశ్వాహా నేతృత్వంలోని ఆర్​ఎల్​ఎస్​పీ కూడా ఎన్​డీఏకే జై కొడుతోంది. ఈ సమావేశం నేపథ్యంలోనే లోక్ జనశక్తి (రామ్ విలాస్​) నేత చిరాగ్ పాసవాన్​.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. మంగళవారం జరిగే ఎన్​డీఏ పక్షాల సమావేశానికి చిరాగ్ కూడా హాజరయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు సంకేతాలు ఇచ్చాయి. కాసేపటికే.. ఎన్​డీఏలో చేరాలని చిరాగ్ నిర్ణయించుకున్నారని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా వెల్లడించారు. కూటమిలోకి ఆయన్ను స్వాగతిస్తున్నట్లు చెప్పారు.

ఎన్​డీఏ తొలి సమావేశం!
తమిళనాడుకు చెందిన ఏఐఏడీఎమ్​కే నాయకులు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీలు, నాయకులను సైతం ఎన్​డీఏ సమావేశానికి జేపీ నడ్డా ఆహ్వానించారు. ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఇదే ఎన్​డీఏ మొదటి సమావేశం. వచ్చే ఏడాది ఏప్రిల్‌-మే మధ్య జరుగుతాయని భావిస్తున్న లోక్‌సభ ఎన్నికలకు ఈ పార్టీలకు నాయకత్వం వహిస్తూ బీజేపీ మరోసారి అధికారం కోసం ప్రయత్నించనుంది. ఎన్​డీఏ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీకి చెందిన సీనియర్ నేతలు హాజరుకానున్నారు.

ముచ్చటగా మూడోసారి..
ప్రాంతాలు, సామాజిక సమీకరణాల ఆధారంగా చిన్నపార్టీలు, ప్రాంతీయ పార్టీలకు స్థానికంగా బలమైన ఓటు బ్యాంకు ఉంది. అత్యధిక లోక్‌సభ సీట్లు ఉన్న ఉత్తర్ ప్రదేశ్‌, బిహార్‌ వంటి రాష్ట్రాల్లో రాజకీయ, సామాజిక సమతుల్యత కోసం ఆయా పార్టీల మద్దతు కీలకం కానుంది. ఈ పార్టీలతో కలిసి ముచ్చటగా మూడోసారి కూడా కేంద్రంలో అధికారం నిలుపుకోవాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగానే ఎన్​డీఏ సమావేశాన్ని నిర్వహించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details