రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ద్రౌపదీ ముర్ము Draupadi Murmu Nomination: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ద్రౌపదీ ముర్ము.. నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీకి ఆమె నామనేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు, భాజపా, ఎన్డీఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. మొదటగా ప్రధాని ఆమె పేరును ప్రతిపాదించారు. ఆ తర్వాత నామినేషన్ పత్రాలను 50 మంది ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ప్రతిపాదించి, మరో 50 మంది బలపరిచారు.
ప్రధాని మోదీ, ముర్ము, రాజ్‌నాథ్ సింగ్ స్వాతంత్ర్య సమరయోధులకు నివాళి.. నామినేషన్ దాఖలు చేయడానికి ముందు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్ము.. పార్లమెంట్ ఆవరణలో స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలకు నివాళులు అర్పించారు. మహాత్మా గాంధీ, డా.బీ.ఆర్. అంబేడ్కర్, బిర్సా ముండా విగ్రహాల వద్ద ముర్ము.. అంజలి ఘటించారు.
నివాళులు అర్పిస్తున్న ద్రౌపదీ ముర్ము నివాళులు అర్పిస్తున్న ద్రౌపదీ ముర్ము సోనియా,మమతలతో సంప్రదింపులు.. ఎన్టీఏ కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ద్రౌపదీ ముర్ము.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, బంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో సంప్రదింపులు జరిపారు. త్వరలో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికలో తనకు మద్దతు తెలిపాలని కోరారు.
ముందు రోజే దిల్లీకి.. నామపత్రాల దాఖలుకు ఒకరోజు ముందుగా గురువారమే దిల్లీకి చేరుకున్న ముర్ము.. ఒడిశా భవన్‌లో బస చేశారు. భువనేశ్వర్ విమానాశ్రయంలో పలు పార్టీల నాయకులు, అభిమానులు ఆమెకు వీడ్కోలు పలికారు. గిరిజన నృత్యాలతో, సంప్రదాయ దుస్తులతో వచ్చిన అభిమానులతో అక్కడంతా కోలాహలం కనిపించింది. దిల్లీకి చేరుకున్న అనంతరం ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాతో ముర్ము భేటీ అయ్యారు. విమానాశ్రయం నుంచి నేరుగా ప్రధానమంత్రి నివాసానికి ఆమె వెళ్లి, తనను దేశ అత్యున్నత పదవికి అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ఆమె ఎంపికను సమాజంలోని అన్ని వర్గాలు ప్రశంసిస్తున్నాయని ప్రధాని ట్వీట్ చేశారు.
ఎవరీ ద్రౌపది ముర్ము?..ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో ఉన్న మారుమూల గ్రామమైన బైదపోసిలో సంతాల్ గిరిజన తెగలో 1958 జూన్ 20న ద్రౌపదీ ముర్ము జన్మించారు. 2015 మార్చి 6 నుంచి 2021 జూలై 12 వరకు ఝార్ఖండ్ గవర్నర్‌గా ఆమె పనిచేశారు. ఝార్ఖండ్ తొలి మహిళా గవర్నర్‌గా ఆమె నియమితులయ్యారు. పైగా దేశ చరిత్రలో ఓ గిరిజన తెగకు చెందిన వ్యక్తి ఓ రాష్ట్రానికి గవర్నర్‌గా నియమితులైన నేత ఆమె కావడం విశేషం. ఒడిశాలోని రాయరంగాపుర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. భాజపా, జేడీయూ సంకీర్ణ ప్రభుత్వంలో వాణిజ్య, రవాణా శాఖ, మత్స్యసంపద, పశుసంవర్ధక శాఖ మంత్రిగా సేవలందించారు. ముర్ము రాజకీయాల్లోకి రాకముందు టీచర్‌గా కూడా కొంతకాలం పనిచేశారు.
యశ్వంత్ సిన్హాకు జెడ్ సెక్యూరిటీ..రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీమంత్రి, టీఎంసీ మాజీ నేత యశ్వంత్ సిన్హాకు కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ.. సీఆర్పీఎఫ్ వీఐపీ భద్రతా విభాగానికి ఆదేశాలు జారీ చేసింది. యశ్వంత్ సిన్హా దేశంలో ఎక్కడ పర్యటించినా ఆయన వెంట షిఫ్టుల వారీగా 8 నుంచి 10 మంది జవాన్లు భద్రతగా ఉంటారు.
యశ్వంత్ సిన్హా ఈనెల 27న రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆ తర్వాత తనకు అనుకూలంగా ఓట్లు వేయాలని కోరుతూ ఆయన దేశవ్యాప్తంగా పర్యటించనున్నారు. అధికార ఎన్డీఏ తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారైన ద్రౌపదీ ముర్ముకు కేంద్రం ఇప్పటికే జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించింది.
జులై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనుండగా.. అదే నెల 21న ఫలితం వెలువడనుంది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జులై 24న ముగియనుంది.
ఇవీ చదవండి:'మహారాష్ట్రలో శివసేన లేకుండా చేయాలని ఎన్సీపీ, కాంగ్రెస్ కుట్ర'
''బ్రిక్స్ సహకారం'తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం'