పోక్సో చట్టం ప్రకారం.. దుస్తుల మీద నుంచి శరీర భాగాలను తాకడం లైంగిక వేధింపుల కిందకు రాదని బాంబే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్లు జాతీయ మహిళా కమిషన్ స్పష్టం చేసింది. మహిళల భద్రత కోసం ఉన్న పలు నియమాలకు ఈ తీర్పు విఘాతం కలిగించడమే కాకుండా, స్త్రీలను అవహేళన చేసేలా తీర్పు ఉందని జాతీయ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రేఖా శర్మ అన్నారు.
ఏం జరిగింది?
ఓ కేసుకు సంబంధించి.. ఈ నెల 19న 'పోక్సో' చట్టం(లైంగిక వేధింపుల నుంచి చిన్నారుల్ని రక్షించడానికి ఉద్దేశించిన చట్టం) ప్రకారం.. దుస్తుల మీద నుంచి శరీర భాగాలను తాకడం లైంగిక వేధింపుల కిందకు రాదని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. ఓ బాలిక వక్షస్థలాన్ని దుస్తులపై నుంచి తాకినంత మాత్రాన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు చెప్పలేమని, చట్టం ఇదే విషయాన్ని విశదీకరిస్తోందని వ్యాఖ్యానించింది.
లైంగిక ఉద్దేశంతో బాలిక దుస్తులు తొలగించి, లేదా దుస్తుల లోపలకి చేయి పెట్టి నేరుగా తాకితేనే అది లైంగిక వేధింపుల కిందకు వస్తుందని పేర్కొంది. 12 ఏళ్ల బాలికపై 39 ఏళ్ల ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నమోదైన కేసు విచారణ సందర్భంగా.. నాగ్‌పుర్ బెంచ్‌కు చెందిన మహిళా న్యాయమూర్తి జస్టిస్ పుష్ప గనేడివాలాతో కూడిన ఏకసభ్య ధర్మాసనం ఈమేరకు తీర్పునిచ్చింది.
ఆ కేసులో నిందితుడికి పోక్సో చట్టంలోని సెక్షన్ 8(చిన్నారులపై లైంగిక దాడి) కింద మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. అయితే నిందితుడికి ఐపీసీ సెక్షన్ 354(ఓ మహిళ గౌరవానికి భంగం కలిగించడం), సెక్షన్ 342(దురుద్దేశంతో నిర్బంధించడం) కింద దిగువ కోర్టు విధించిన ఒక ఏడాది కఠిన కారాగార శిక్షను మాత్రం సమర్థించింది.
ఇదీ చూడండి:'లైంగిక వేధింపులపై హైకోర్టు తీర్పు దారుణం'