NCRB Report 2022: దేశ రాజధాని దిల్లీలో మహిళలకు భద్రత కొరవడుతోంది. గతేడాది అక్కడ సగటున రోజుకు ఇద్దరు బాలికలపై అఘాయిత్యాలు జరిగాయి. ఈ మేరకు జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) తాజా నివేదికలో వెల్లడించింది. దిల్లీలోనే అత్యధికంగా మహిళలపై నేరాలు జరిగాయి. అంతేగాక, గతేడాది అత్యధికంగా అత్యాచార కేసులు నమోదైన మెట్రోపాలిటన్ నగరాల్లోనూ దిల్లీ తొలి స్థానంలో ఉండటం గమనార్హం.
NCRB నివేదికలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి..
- 2021లో దిల్లీలో మహిళలపై నేరాలకు సంబంధించి 13,892 కేసులు నమోదయ్యాయి. అంతక్రితం 2020 ఏడాది(9,782 కేసులు)తో పోలిస్తే కేసులు 40శాతం మేర పెరిగాయి.
- దేశవ్యాప్తంగా 19 మెట్రోపాలిటన్ నగరాల్లో మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించిన మొత్తం 43,414 కేసులు నమోదు కాగా.. ఇందులో 32.20శాతం ఒక్క దిల్లీలోనే చోటుచేసుకున్నాయి.
- దిల్లీ తర్వాత ముంబయిలో 5,543 కేసులు, బెంగళూరులో 3,127 కేసులు నమోదయ్యాయి.
- దేశవ్యాప్తంగా గతేడాది 31,677 అత్యాచార కేసులు నమోదవ్వగా.. 31,878 మంది లైంగికదాడుల బాధితులున్నారు.
- 19 మెట్రోపాలిటన్ నగరాల్లో మొత్తంగా 3,208 అత్యాచార కేసులు నమోదవ్వగా.. దిల్లీలో అత్యధికంగా 1226 కేసులు నమోదయ్యాయి.
- 2021లో దిల్లీలో సగటున ప్రతి రోజు ఇద్దరు బాలికలపై లైంగిక దాడులు చోటుచేసుకున్నాయి. గతేడాది దేశ రాజధానిలో 833 బాలికలపై అత్యాచార కేసులు నమోదయ్యాయి.
- దిల్లీ తర్వాత జైపుర్‌లో 502, ముంబయిలో 365 లైంగికదాడుల కేసులు నమోదయ్యాయి.
- అత్యల్పంగా కోల్‌కతాలో 11, కొయంబత్తూర్‌లో 12, పట్నాలో 30 అత్యాచార కేసులు నమోదయ్యాయి.
- ఇతర మెట్రో నగరాలైన ఇండోర్‌లో 165, బెంగళూరులో 117, హైదరాబాద్‌లో 116, నాగ్‌పుర్‌లో 115 లైంగిక దాడుల కేసులు నమోదయ్యాయి.
- రాష్ట్రాల వారీగా, రాజస్థాన్‌లో అత్యధికంగా 6,337 అత్యాచార కేసులు నమోదవ్వగా.. అత్యల్పంగా నాగాలాండ్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి.