దేశంలో గతేడాది నుంచి విలయం సృష్టిస్తున్న కరోనా కారణంగా 30 వేలకు పైగా చిన్నారులు తల్లిదండ్రులకు దూరమైనట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మేరకు వివరాలను జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) సుప్రీంకోర్టుకు సమర్పించింది. కరోనాతో అనాథలైన చిన్నారులకు రక్షణ కల్పించాలంటూ సుప్రీంకోర్టులో దరఖాస్తు దాఖలు కాగా.. వారి వివరాలను ఎన్సీపీసీఆర్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
విలయంతో విషాదం..
ఆ వివరాల ప్రకారం గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు 3,621 మంది చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలు కాగా, 26,176 మంది తల్లిదండ్రులలో ఒకరిని కోల్పోయారు. వీరిలో 15,620 మంది బాలురు ఉండగా, 14,447 మంది బాలికలు ఉన్నారు. ఎక్కువగా 8-13 సంవత్సరాల మధ్య వయసున్న చిన్నారులు 11,815 మంది తల్లిదండ్రుల్లో ఒకరు లేదా ఇద్దరినీ కోల్పోయారని కమిషన్ నివేదికలో వెల్లడించింది. 16-18 ఏళ్ల వయసున్న వారు 5,339 మంది, 4-7 వయసున్న వారు 5,107 మంది, 14-15 ఏళ్ల వయసున్న వారు 4,908 మంది, మూడేళ్ల లోపు వారు 2,900 మంది ఉన్నట్లు కమిషన్ పేర్కొంది.
ఇదీ చదవండి:అనాథలైన చిన్నారుల డేటా కొవిడ్ పోర్టల్లో!