Sharad Pawar Resigns : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ ప్రకటించారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన మంగళవారం తెలిపారు. తాను రిటైర్మెంట్ ప్రకటించినా.. బలహీన వర్గాలు, యువత విద్యార్థుల ప్రోత్సాహానికి కృషి చేస్తానని చెప్పారు. ప్రస్తుతం తనకు మూడేళ్ల రాజ్యసభ పదవీకాలం ఉందని, ఆ తర్వాత ఎన్నికల్లో కూడా పోటీ చేయబోనని పవార్ వెల్లడించారు. అదనపు బాధ్యతలను చేపట్టబోనని స్పష్టం చేశారు.
ముంబయిలోని యశ్వంతరావు చవాన్ ప్రతిస్థాన్‌లో జరిగిన తన ఆత్మకథ పుస్తకావిష్కరణ వేడుక సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు పవార్. పార్టీ భవిష్యత్ కార్యాచరణ కోసం సీనియర్లతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పవార్ పేర్కొన్నారు. కమిటీలో అజిత్ పవార్, సుప్రియా సూలే, జయంత్ పాటిల్, ప్రఫుల్ పటేల్ ఉన్నారు. అయితే తన సమీప బంధువు అజిత్ పవార్.. ఎన్సీపీని వీడి బీజేపీలో చేరతారనే ఊహాగానాల మధ్య పవార్ ఈ నిర్ణయాన్ని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ తదుపరి అధ్యక్షుడు ఎవరనే విషయంపై మాత్రం స్పష్టత రాలేదు.
పవార్ రాజీనామా నిర్ణయంపై కార్యకర్తల నిరసన..
శరద్ పవార్ రాజీనామా ప్రకటన తర్వాత అనంతరం సభాస్థలిలో ఉన్న పార్టీ కార్యకర్తలు, నేతలు నిరసన వ్యక్తం చేశారు. మరికొంత మంది అయితే కంటతడి పెట్టుకున్నారు. పవార్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని.. లేని పక్షంలో వేదిక వదిలి వెళ్లనివ్వమని భీష్మించు కూర్చున్నారు. అధ్యక్షుడిగా పవార్ కొనసాగాలని నినాదాలు చేశారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు వేదిక మీద నుంచి కదలనివ్వబోమని తేల్చి చెప్పారు.
నిరసన చేస్తున్న కార్యకర్తలకు అజిత్ పవార్ సర్దిచెప్పారు. రెండు మూడు రోజుల్లో శరద్ పవార్ తన నిర్ణయంపై పునరాలోచించుకుంటారని భరోసా ఇచ్చారు.
ఎన్సీపీ అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా.. నిరసన తెలిపిన కార్యకర్తలు '15 రోజుల్లో దేశ రాజకీయాల్లో 2 భారీ కుదుపులు'
బీజేపీ చేరతారన్న వార్తలను అజిత్ పవార్‌తోపాటు శరద్ పవార్ తోసిపుచ్చారు. అయితే శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే మాత్రం వచ్చే 15 రోజుల్లో దేశ రాజకీయాల్లో 2 భారీ కుదుపులు సంభవిస్తాయని తెలిపారు. ఒకటి దిల్లీలో, ఇంకోటి మహారాష్ట్రలో అని వ్యాఖ్యానించడం వల్ల ఈ విషయం ఆమెకు ముందుగానే తెలిసి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
'వయసు, ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని చూడాలి'
శరద్ పవార్ రాజీనామా నిర్ణయంపై ఆయన అల్లుడు అజిత్ పవార్ స్పందించారు. "శరద్ పవార్ కొద్ది రోజుల క్రితమే తన రాజీనామా నిర్ణయం గురించి నాకు చెప్పారు. ఆయన వయసు, ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని శరద్ పవార్ నిర్ణయాన్ని మనం చూడాలి. ప్రతి ఒక్కరూ సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవాలి. ఆయన ఇప్పుడు తీసుకున్నారు. తన రాజీనామా నిర్ణయంపై ఆయన కట్టుబడి ఉంటారు" అని అజిత్ పవార్ తెలిపారు.
రాజీనామా నిర్ణయం ప్రకటించే ముందు శరద్ పవార్ ఎవరి సలహాలను పరిగణనలోకి తీసుకోలేదని ఎన్సీపీ మరో నేత ప్రఫుల్ పటేల్ వ్యాఖ్యానించారు.
మహా వికాస్ అఘాడి కూటమి ఏర్పాటుకు ఎంతో కృషి
నాలుగుసార్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహా కేంద్ర ప్రభుత్వంలో రక్షణ, వ్యవసాయ శాఖలకు మంత్రిగా సేవలందించారు పవార్. మహారాష్ట్రలో ఇంతకుముందు ఉన్న సంకీర్ణ ప్రభుత్వంలో భిన్న సిద్ధాంతాలు కలిగిన పార్టీలను ఒకే తాటిపైకి తేవడంలో పవార్ ఎంతో కృషి చేశారు. ఆయన చొరవ వల్లే కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కలిసి మహా వికాస్ అఘాడి కూటమిగా ఏర్పడి అధికారాన్ని పంచుకున్నాయి.
అయితే, శివసేనలో చీలిక రావడం వల్ల ఆ కూటమి ప్రభుత్వం కూలిపోయింది. అయినప్పటికీ ఆ పార్టీలు మాత్రం ఇప్పటికీ ఒక్కటిగానే ఉన్నాయి. పవార్ తాజా నిర్ణయంతో మహా వికాస్ అఘాడీ భవిష్యత్‌పైనా ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. 2024లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని యోచిస్తున్న వేళ.. పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి పవార్ తప్పుకోవడం గమనార్హం.
కాంగ్రెస్‌తో విభేదాల వల్ల..
పవార్ 1940లో మహారాష్ట్రలోని బారామతిలో జన్మించారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి చూపిన ఆయన.. కాంగ్రెస్ పార్టీతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. హస్తం పార్టీ తరఫున 4 సార్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినా పూర్తిస్థాయిలో ఎప్పుడూ పదవిలో కొనసాగలేదు. పలు పర్యాయాలు పార్లమెంట్ ఉభయసభలకు ప్రాతినిధ్యం వహించారు.
1999లో విభేదాలతో పవార్ కాంగ్రెస్‌ను వీడి నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. 2005 నుంచి 2008 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నారు. 2010 నుంచి 2012 వరకు ఐసీసీ అధ్యక్షుడిగానూ పనిచేశారు. మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ హయాంలో కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న పవార్.. ఎన్సీపీ సభాపక్ష నేతగా కొనసాగుతున్నారు. రాజకీయరంగంలో చేసిన సేవలకు గానూ.. 2017లో పద్మ విభూషణ్‌తో కేంద్రం సత్కరించింది.