NCP Political Crisis : మహారాష్ట్ర ఎన్సీపీలో సంక్షోభం కొనసాగుతోంది. శరద్ పవార్ వర్గం, అజిత్ పవార్ వర్గంగా విడిపోయి తమదే పార్టీ అంటే తమదే పార్టీ అనే స్థాయికి పరిస్థితి వచ్చింది. పార్టీ క్రమశిక్షణ కమిటీ నివేదిక మేరకు ఎన్‌సీపీ కార్యనిర్వహక అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్, లోక్‌సభ సభ్యుడు సునీల్ తత్కారేను పార్టీ నుంచి బహిష్కరిస్తూ ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు వారిద్దరినీ బహిష్కరించినట్ల పవార్ తెలిపారు. ఇదే విషయాన్ని శరద్ పవార్ ట్విట్టర్‌లో పేర్కొంటూ.. బహిష్కరించిన ఇద్దరు నేతలకు ట్యాగ్ చేశారు.
తిరుగుబాటు నేతలపై శరద్ పవార్ తీసుకున్న చర్యలు చెల్లవని ప్రఫుల్ పటేల్ ప్రకటించారు. మెజార్టీ ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నారని.. కాబట్టి మెజార్టీ నిర్ణయాలను శరద్ పవార్ గౌరవించాలని కోరారు. పవార్ ఆశీస్సులను తాము కోరుతున్నట్లు వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఎన్‌సీపీ మహారాష్ట్ర అధ్యక్షుడిగా జయంత్ పాటిల్‌ను తప్పించి.. ఆ స్థానంలో ఎంపీ సునీల్ తత్కారేను నియమిస్తున్నట్లు ప్రఫుల్ పటేల్ ప్రకటించారు. అజిత్ పవార్ ఎన్‌సీపీ శాసనసభాపక్ష నేతగా కొనసాగుతారని వెల్లడించారు. రూపాలి చకాంకర్‌ను ఎన్‌సీపీ మహారాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించిన ప్రఫుల్ పటేల్.. ఎమ్ఎల్సీ అమోల్ మిట్కారీ, అనంద్ పరాంజిపేను.. పార్టీ అధికార ప్రతినిధులుగా నియమించారు.
జయంత్ పాటిల్ సహా పవార్ వర్గం NCP శాసనసభాపక్ష నేతగా నియమించిన.. జితేంద్ర అవహద్‌పై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కోరినట్లు అజిత్ పవార్ చెప్పారు. మెజార్టీ ఎమ్మెల్యేలు తమతో ఉన్నారు కాబట్టే.. తాను ఉపముఖ్యమంత్రిని అయినట్లు అజిత్ పవార్ చెప్పారు. పార్టీ తమతోనే ఉందని, గుర్తు తమదేనని చెప్పిన అజిత్ పవార్.. తాము పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు వివరించారు. ఎన్‌సీపీ జాతీయ అధ్యక్షుడిగా శరద్ పవార్ ఉన్నట్లు అజిత్ పవార్ చెప్పారు. శాసనసభలో ప్రతిపక్ష నేతను పార్టీ నిర్ణయించదని, స్పీకర్ మాత్రమే నిర్ణయిస్తారని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో తన ఆశీస్సులతోనే.. అజిత్ పవార్ మహారాష్ట్ర మంత్రివర్గంలో చేరినట్లు జరుగుతున్న ప్రచారాన్ని శరద్ పవార్ ఖండించారు. సతారాలో మాట్లాడిన ఆయన కొంతమంది నేతల చర్యలతో ఆందోళనకు గురైన కార్యకర్తల్లో తిరిగి విశ్వాసం పెంచేందుకు మహారాష్ట్ర అంతటా పర్యటించి పార్టీని బలోపేతం చేస్తానని అన్నారు. 2019లో ఏర్పడిన మహావికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వాన్ని కొందరు కూలదోశారన్న పవార్.. ఇలాంటివి మహారాష్ట్రలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ జరుగుతున్నాయన్నారు. మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని.. 2020 మార్చిలో పడగొట్టారని గుర్తుచేశారు. ప్రఫుల్ పటేల్‌కు అన్నీ తెలిసినా ఎందుకు ఇలా చేశారో తెలియదన్న శరద్ పవార్.. ఏదేమైనా అజిత్ పవార్ సహా ఎమ్మెల్యేలు చేసిన పని సరైనది కాదని అభిప్రాయపడ్డారు.
మహారాష్ట్ర మంత్రులుగా ప్రమాణం చేసిన అజిత్ పవార్ సహా 9 మందిపై ఎమ్మెల్యేలుగా అనర్హతవేటు వేయాలని కోరుతూ.. మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నర్వేకర్‌కు ఎన్‌సీపీ పిటిషన్లు సమర్పించింది. అజిత్ పవార్ తిరుగుబాటు అనంతరం.. ఎన్‌సీపీ శాసనసభాపక్ష నేతగా నియమించిన జితేంద్ర అవహద్.. ఈ అనర్హత పిటిషన్లను స్పీకర్ ఇంట్లో ఆదివారం బాగా పొద్దుపోయిన తర్వాత సమర్పించారు. స్పీకర్ కార్యాలయం వీటిని ధ్రువీకరించినట్లు తెలిసింది. ఎన్నికల కమిషన్‌కు కూడా లేఖ పంపినట్లు ఎన్‌సీపీ మహారాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ వెల్లడించారు.