ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హతకు గురైన లక్షద్వీప్ మాజీ ఎంపీ, ఎన్సీపీ నేత మహమ్మద్ ఫైజల్‌కు భారీ ఊరట లభించింది. ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ లోక్‌సభ సెక్రెటేరియట్ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయనపై అనర్హతను వెనక్కి తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. ఓ క్రిమినల్ కేసులో దోషిగా తేలిన ఆయనకు కింది కోర్టు 10ఏళ్ల శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో ఆయన సభ్యత్వాన్ని జనవరి 13న లోక్‌సభ రద్దు చేసింది. కింది కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేరళ హైకోర్టు నుంచి జనవరి 25న సస్పెన్షన్ ఆదేశాలను తెచ్చుకున్నారు ఫైజల్. ఈ నేపథ్యంలోనే లోక్‌సభ సెక్రెటేరియట్ తాజా నిర్ణయం తీసుకుంది. రాహుల్ గాంధీపైనా అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఫైజల్ వ్యవహారంపై ఆసక్తి ఏర్పడింది.
మరోవైపు, లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరించిన నేపథ్యంలో ఫైజల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. అయితే, ఇంత ఆలస్యంగా తన సభ్యత్వాన్ని పునరుద్ధరించడంపై మహమ్మద్ ఫైజల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 'సభ్యత్వం పునరుద్ధరించడంలో ఇంత ఆలస్యం ఆమోదనీయం కాదు. కోర్టు దోషిగా తేల్చిన తర్వాతి రోజే లోక్‌సభ సెక్రెటేరియట్ నాపై అనర్హత వేసింది. ఆ విషయంలో చూపిన వేగం.. సభ్యత్వం పునరుద్ధరించడంలోనూ ఉండాల్సింది' అని ఫైజల్ పెదవి విరిచారు.
ఫైజల్ దాఖలు చేసిన కేసు మంగళవారం ప్రస్తావనకు రాగా.. సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించక పోవడం వల్ల ఏ ప్రాథమిక హక్కుకు భంగం వాటిల్లిందని ఫైజల్‌ను ప్రశ్నించింది. హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదని అడిగింది. నియోజకవర్గ ప్రజలు తనను ఎన్నుకున్నారని, వారికి ప్రాతినిధ్యం వహించే హక్కును లాగేసుకున్నారని ఫైజల్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి.. సుప్రీంకోర్టుకు సమాధానమిచ్చారు. సుప్రీంకోర్టులో ఇదివరకే సంబంధిత కేసును విచారించారని, అందుకే ఇక్కడే వ్యాజ్యం దాఖలు చేసినట్లు వివరించారు.
ఫైజల్ కేసు ఏంటంటే?
2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేత మహ్మద్ సలీహ్‌పై దాడి చేశారన్న కేసులో మహ్మద్ ఫైజల్‌ను కవరత్తీ సెషన్స్ కోర్టు దోషిగా తేల్చింది. పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ఈ ఏడాది జనవరి 10న తీర్పు చెప్పింది. జనవరి 13న లోక్‌సభ సచివాలయం ఆయనపై అనర్హత వేటు వేసింది. దీంతో లోక్‌సభ సభ్యత్వం రద్దైంది. తనకు పడ్డ శిక్షను సవాల్ చేస్తూ ఫైజల్.. కేరళ హైకోర్టును ఆశ్రయించగా.. సెషన్స్ కోర్టు తీర్పును నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది ధర్మాసనం. దీంతో ఆయనపై అనర్హత చెల్లుబాటు కాకుండా పోయింది. అయితే, ఫైజల్ సభ్యత్వాన్ని లోక్‌సభ సచివాలయం పునరుద్ధరించలేదు. దీన్ని ఆయన సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. బుధవారం ఈ కేసు విచారణ జరగాల్సి ఉండగా.. అంతకుముందే లోక్‌సభ సచివాలయం ఫైజల్ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ ప్రకటన విడుదల చేసింది.
రాహుల్ కేసు ఇదీ..
ప్రస్తుతం కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీపైనా అనర్హత వేటు పడింది. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని రాహుల్‌పై నమోదైన కేసులో సూరత్ కోర్టు ఆయన్ను దోషిగా తేల్చింది. రెండేళ్ల శిక్ష సైతం విధించింది. ఈ నేపథ్యంలోనే ఆయన సభ్యత్వాన్ని లోక్‌సభ రద్దు చేసింది.