ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ (Sharad Pawar News) కేంద్ర ప్రభుత్వంపై మరోసారి మండిపడ్డారు. విపక్షాలను లక్ష్యంగా చేసుకునే సీబీఐ, ఈడీ, నార్కొటిక్స్ బ్యూరో వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచడంలో విఫలం కావడంతోనే కేంద్రం ఇటువంటి ప్రయత్నాలకు దిగుతోందని శరద్ పవార్ (Sharad Pawar News) విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌తోపాటు తమ కూటమి నేతలపై వరుసగా జరుగుతోన్న కేంద్ర సంస్థల దాడులను ఆయన ప్రస్తావించారు.
ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్‌పై గతకొన్ని రోజులుగా ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తోంది. మరోవైపు ఎన్‌సీపీకే చెందిన అనిల్ దేశ్‌ముఖ్ ఇంటిపై ఇప్పటికే ఐదుసార్లు సీబీఐ సోదాలు చేసింది. వీటితోపాటు ఎన్‌సీబీ కూడా మరికొంతమంది ప్రముఖుల ఇళ్లలో సోదాలు జరుపుతోంది. ఇలా కేవలం ప్రతిపక్షాలను టార్గెట్ చేయడం కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను భాజపా దుర్వినియోగం చేస్తోందని ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ (Sharad Pawar News) ఆరోపించారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని ప్రయత్నించిన భాజపా.. అందులో విఫలం కావడంతోనే అధికార కూటమీ (మహా వికాస్ అఘాడీ)కి చెందిన నేతలపై దాడులకు ఉపక్రమించిందని విమర్శించారు.