NCERT Removed Periodic Table : పదో తరగతి పాఠ్య ప్రణాళిక నుంచి.. మరికొన్ని పాఠ్యాంశాలను తొలగిస్తూ జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (NCERT) నిర్ణయం తీసుకుంది. సిలబస్ హేతుబద్దీకరణలో భాగంగా.. పదో తరగతి పాఠాల్లో పిరియాడిక్ టేబుల్, ప్రజాస్వామ్యం, శక్తి వనరుల పాఠ్యాంశాలను తొలగించాలని నిర్ణయించింది. విద్యార్థులపై భారాన్ని తగ్గించేందుకే.. ఈ నిర్ణయం తీసుకున్నామని NCERT వెల్లడించింది.
ఇటీవలే జీవ పరిణామ సిద్ధాంతాన్ని పదో తరగతి సిలబస్ నుంచి తొలగించిన NCERT... ఇప్పుడు మరికొన్ని పాఠాలను తొలగించింది. పర్యావరణ సుస్థిరత, శక్తి వనరులు, ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యానికి సవాళ్లు, రాజకీయ పార్టీల పూర్తి అధ్యాయాలను తొలగించింది. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులపై భారాన్ని తగ్గించడం అత్యవసరమని NCERT పేర్కొంది. పిల్లలపై చదువుల భారాన్ని తగ్గించేందుకు సిలబస్ హేతుబద్దీకరణ జరుగుతోందన్న కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి సుభాస్ సర్కార్.. తర్వాతి తరగతుల్లో వారు ఆ సిలబస్‌లను చదువుకోవచ్చని పేర్కొన్నారు.
GRE కీలక నిర్ణయం..
GRE Exam Duration : 2023 సెప్టెంబరులో జరగబోయే గ్రాడ్యుయేట్ రికార్డ్ పరీక్ష (GRE) సమయాన్ని 1 గంట 58 నిమిషాలకు కుదించామని ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్(ఈటీఎస్) గురువారం ప్రకటించింది. ఎగ్జామ్ పూర్తయిన తర్వాత 10 రోజుల్లోనే స్కోర్‌ను విడుదల చేస్తామని తెలిపింది. అంతకుముందు GRE పరీక్ష సమయం 3 గంటల 45 నిమిషాలు ఉండగా.. ఆ సమయాన్ని దాదాపు సగానికి తగ్గించామని పేర్కొంది. అలాగే వ్యాసరచన, వెర్బల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ రీజనింగ్ విభాగాల్లో ప్రశ్నల సంఖ్యను తగ్గిస్తున్నట్లు పేర్కొంది.