బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో(Mumbai Drug Case) ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడేపై(Sameer Wankhede) మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్(Nawab Malik) మరో సంచలన ఆరోపణ చేశారు. ఆర్యన్ ఖాన్‌ను కిడ్నాప్ చేసేందుకు వాంఖడే కుట్ర పన్నారని ఆరోపించారు. ఈ కుట్రకు భాజపా నేత మోహిత్ భారతీయ ప్రధాన సూత్రధారి అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు విలేకరుల సమావేశంలో ఆదివారం ఆయన మాట్లాడారు.
ఓశివారా ప్రాంతంలోని శ్మశానవాటికలో భారతీయను వాంఖడే కలిశారని నవాబ్ మాలిక్(Nawab Malik) ఆరోపించారు.
"క్రూయిజ్ పార్టీ కోసం ఆర్యన్ ఖాన్ టికెట్టు కొనుగోలు చేయలేదు. పార్తిక్ గాబా, అమీర్ ఫర్నీచర్‌వాలా వాటిని కొనుగోలు చేసి, అతణ్ని అక్కడకు తీసుకువచ్చారు. ఆర్యన్ ఖాన్‌ను కిడ్నాప్ చేసి, డబ్బులు వసూలు చేసేందుకు సమీర్ వాంఖడే(Sameer Wankhede), మోహిత్ కుట్ర పన్నారు. ఈ కుట్రకు సూత్రధారి మోహిత్."
-నవాబ్ మాలిక్, మహారాష్ట్ర మంత్రి
"అక్టోబరు 7న ఓశివారా శ్మశానవాటిక వద్ద మోహిత్‌ను వాంఖడే(Sameer Wankhede) కలిశారు. ఈ విషయం అందరికీ తెలుస్తుందేమోన్న భయంతో వాంఖడే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడి సీసీటీవీ పనిచేయకపోవడం వాళ్ల అదృష్టంగా మారింది" అని నవాబ్ మాలిక్(Nawab Malik) చెప్పారు.
'షారుక్ నోరు విప్పాలి'
ఆర్యన్ ఖాన్ అరెస్టయిన తొలిరోజు నుంచి షారుక్ ఖాన్‌కు బెదిరింపులు మొదలయ్యాయని నవాబ్ మాలిక్ తెలిపారు. ఇప్పటికీ బహిరంగంగా మాట్లాడొద్దని షారుక్‌కు ఆదేశాలిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా షారుక్ బయటకు వచ్చి నోరు విప్పాలని కోరారు. కుమారుణ్ని కిడ్నాప్ చేస్తే డబ్బు ఇవ్వడంలో తప్పులేదని వ్యాఖ్యానించారు.
'ఆయన్ను అక్కడే ఆపేశారు..'
ఇక మోహిత్ భారతీయ ఆరోపిస్తున్నట్లుగా తానెప్పుడూ సునీల్ పాటిల్ అనే వ్యక్తిని కలవలేదన్నారు మాలిక్. ఈ కేసుపై తొలిసారి తాను ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే సునీల్ పాటిల్ ఫోన్ చేశారని చెప్పారు. తనతో కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నానని చెప్పారని వెల్లడించారు. అయితే, పోలీసులతో చెప్పాలని తాను సూచించగా.. గుజరాత్‌లోనే ఆయన్ను నిలిపివేశారన్నారు.