ఝార్ఖండ్ గుమ్లా జిల్లా కురుమ్గఢ్లో ఇటీవల నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని(Kurumgarh Police Station Blast) పేల్చేశారు మావోయిస్టులు. మూడు రోజుల బంద్(నవంబరు 23-25) చివరి రోజున.. గురువారం ఠాణాపై బాంబుతో దాడిచేశారు. స్టేషన్లో పోలీసులు లేని సమయంలో ఈ దాడికి పాల్పడ్డారు. మావోయిస్టు అగ్రనేతలను అరెస్ట్ చేయడానికి ప్రతీకారంగా దాడి చేశామని నక్సల్స్ ప్రకటించారు. ఈ మేరకు ఘటనాస్థలిలో ఓ కరపత్రాన్ని ఉంచి వెళ్లారు.
అరెస్టులకు వ్యతిరేకంగా..
మావోయిస్టు పోలిటికల్ బ్యూరో సభ్యులు.. ప్రశాంత్ బోస్ అలియాస్ కిషన్ దా(prashant bose alias kishanda), అతని భార్య నారీ ముక్తి సంఘ్ నాయకురాలు షీలా మరందీని నవంబరు 12న సరాయ్ఖెలాలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ చర్యను నిరసిస్తూ.. ఝార్ఖండ్‌తో పాటు, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో మూడు రోజులపాటు బంద్ ప్రకటించారు మావోయిస్టులు. అరెస్ట్ చేసిన ప్రశాంత్ బోస్, షీలాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.