ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో జరిగిన ఐఈడీ పేలుడు కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మావోయిస్ట్ నేత జగదీశ్ సోధి ఈ దాడికి ప్రధాన సూత్రధారి అని పోలీసులు చెబుతున్నారు. అతడి మీద ఐదు లక్షల రివార్డు కూడా ఉన్నట్లు వెల్లడించారు. సూత్రధారిని గుర్తించడంతో పాటు పేలుడుకు ఉపయోగించిన పద్ధతిని పోలీసులు ఛేదించారు. ఫాక్స్ హోల్ మెకానిజం అనే పద్ధతిని ఉపయోగించి రెండు నెలల ముందుగానే ఐఈడీని రహదారి కింద అమర్చినట్లు గుర్తించారు. ఫాక్స్ హోల్ అనేది సొరంగం తవ్వడంలో ఒక శైలి. ఇది పోలీసులు నుంచి మావోయిస్టులను తప్పించడంలో ఉపయోగపడుతుంది. మందుపాతరలను గుర్తించేటప్పుడు కూడా ఆ సొరంగాన్ని కనుగొనలేమని పోలీసులు వెల్లడించారు.
పేలుడు కోసం ఐఈడీని రెండు నెలల ముందుగానే రహదారి కింద అమర్చినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ఈ నెల 26న మావోయిస్టుల కోసం కూంబింగ్ చేపట్టి తిరిగి వస్తుండగా దంతెవాడలో జరిగిన బాంబు పేలుడులో 10 మంది డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్స్‌తో పాటు ఒక పౌరుడు మరణించారు. బాంబు పేలుడు అనంతరం మావోయిస్టులు భద్రతా బలగాలపై కాల్పులకు దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో పేలుడు జరిగిన మరుసటి రోజు వెలుగులోకి వచ్చింది. కాగా.. భద్రతా బలగాలపై దాడులు చేస్తామని నక్సల్స్ పేరుతో గతవారం పోలీసులకు ఓ బెదిరింపు లేఖ వచ్చింది. దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈలోపే ఈ దుర్ఘటన జరిగింది.
దంతెవాడ అడవుల్లో మావోయిస్టులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి అందిన సమాచారంతో బుధవారం ఉదయం డిస్ట్రిక్ రిజర్వ్‌గార్డ్ ( DRG) పోలీసులు.. ప్రత్యేక యాంటీ-నక్సలైట్‌తో కలిసి ఆపరేషన్ చేపట్టారు. ఆ ఆపరేషన్ ముగించుకుని మినీ వ్యాన్‌లో తిరిగివస్తుండగా.. అరణ్పుర్ ప్రాంతంలో మావోయిస్టులు ఐఈడీతో వాహనాన్ని పేల్చేశారు. దాడి జరిగిందని సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. భారీ సంఖ్యలో భద్రతా సిబ్బందిని మోహరించారు.