మహారాష్ట్ర రాజకీయాలను మాదక ద్రవ్యాల అంశం కుదిపేస్తోంది. మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్, ఆయన భార్య అమృతా ఫడణవీస్‌కు (nawab malik on devendra fadnavis) డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయంటూ మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ సోమవారం ఆరోపించారు. ఈ మేరకు మాదకద్రవ్యాల వ్యాపారి జైదీప్ రానాతో ఫడణవీస్ దంపతులు దిగిన ఫొటోలను ట్వీట్ చేశారు. "భాజపాకు, డ్రగ్స్ దళారుల మధ్య సంబంధాలపై చర్చిద్దాం" అని వ్యాఖ్యానించారు. మాలిక్ ట్వీట్‌పై దేవేంద్ర ఫడణవీస్ స్పందించారు. డ్రగ్స్ వ్యాపారులతో తనకు సంబంధం లేదని, ఫొటోలో ఉన్న వ్యక్తి.. ఓ స్వచ్ఛంద సంస్థ కార్యక్రమంలో తమతో ఫొటోలు దిగారని వివరణ ఇచ్చారు. మాలిక్‌కు అండర్ వరల్డ్ మాఫియాతో సంబంధాలున్నాయని, ఆ వివరాలను దీపావళి తర్వాత వెల్లడిస్తానని ఫడణవీస్ పేర్కొన్నారు. దీనిపై 'నేను సిద్ధంగా ఉన్నా' అంటూ మాలిక్ ట్వీట్ చేశారు.
ఎస్సీ కమిషన్‌ను కలిసిన వాంఖడే
తప్పుడు కుల ధ్రువీకరణ పత్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న (Sameer Wankhede latest news) ముంబయి మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం(ఎన్‌సీబీ) జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే.. సోమవారం జాతీయ ఎస్సీ కమిషన్(ఎన్‌సీఎస్‌సీ) ఛైర్‌పర్సన్ విజయ్ సంప్లాను కలిశారు. తన కుల ధ్రువీకరణ పత్రంతో పాటు...తొలి వివాహానికి సంబంధించిన విడాకుల పత్రాలనూ అందజేశారు. వీటిని తాము సరిచూస్తామని, ఒక వేళ పత్రాలు నిజమని తేలితే.. వాంఖడేపై ఎలాంటి చర్యలూ ఉండవని సంప్లా తెలిపారు. తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో వాంఖడే ఉద్యోగం సంపాదించారని.. అతను ముస్లిం అంటూ ఎన్‌సీపీ నేత నవాబ్ మాలిక్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు షారుక్ కుమారుడు ఆర్యన్ డ్రగ్స్ కేసును వాంఖడే విచారిస్తున్నారు.