మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ(ఎన్‌సీబీ) ముంబయి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై(Sameer Wankhede news) మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్(Nawab Malik News) తన విమర్శలు, ఆరోపణల పర్వాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. నౌకలో ఏర్పాటుచేసిన పార్టీ పేరుతో ఆర్యన్ ఖాన్‌ను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం జరిగిందని, ఇందుకు సూత్రధారి సమీర్ వాంఖడేనే అని ఆదివారం(నవంబరు 7) సంచలన ఆరోపణలు చేసిన మాలిక్.. తాజాగా ఆయనపై మరిన్ని ఆరోపణలు చేశారు. వాంఖడే మరదలు హర్షదా దీనానత్ రేడ్కర్‌కు డ్రగ్స్ వ్యాపారాలతో సంబంధముందన్న ఆయన.. దీనిపై ఎన్‌సీబీ అధికారి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణా నియంత్రణ చట్టం కింద 2008లో నమోదైన కేసులో వాంఖడే సతీమణి క్రాంతీ రేడ్కర్ సోదరి హర్షదా పేరు కూడా ఉంది. ఈ కేసును ఆధారంగా చేసుకుని నవాబ్ మాలిక్(Nawab Malik News).. సమీర్‌పై ఆరోపణలు చేశారు.
"సమీర్ దావూద్ వాంఖడే.. మీ మరదలు హర్షదా దీనానత్ రేడ్కర్ డ్రగ్స్ వ్యాపారం చేశారా? దీనికి మీరు తప్పనిసరిగా సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఆమె కేసు పుణె కోర్టులో పెండింగ్‌లో ఉంది" అని మాలిక్ ట్వీట్ చేశారు.