Navy Officer Fraud :హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు విశ్రాంత నౌకాదళ ఉద్యోగి పక్కా స్కెచ్ వేశాడు. ఓ ఇద్దరు కూలీలను చంపి దహనం చేసి.. అందులో తాను ఉన్నట్లు అందరినీ నమ్మించాడు. పేరు మార్చుకుని వేరే ప్రాంతానికి పరారయ్యాడు. ఈ ఘటన 20 ఏళ్ల కింద జరగగా.. తాజాగా బయటకువచ్చింది. ప్రస్తుతం అమన్‌సింగ్‌గా పేరు మార్చుకుని దిల్లీలోని నజఫ్‌గఢ్‌లో కుటుంబంతో కలిసి ఉంటున్న బాలేశ్ కుమార్‌ను అరెస్టు చేసినట్లు దిల్లీ పోలీసులు మంగళవారం ప్రకటించారు.
ఇదీ జరిగింది
పానీపత్కు చెందిన 63 ఏళ్ల బాలేశ్ కుమార్.. 15 సంవత్సరాలు నౌకాదళంలో పనిచేసి పదవీవిరమణ పొందాడు. 1981 నుంచి 1996 వరకు నేవీలో పనిచేసి రిటైరై ఉత్తమ్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. 2004లో నిందితుడు, మాజీ నేవీ ఉద్యోగి బాలేశ్ కుమార్.. తన బంధువు రాజేశ్ అలియాస్ కుశీరామ్‌ను డబ్బుల విషయమై దిల్లీలో హత్య చేశాడు. అప్పుడు నిందితుడి వయసు 40 సంవత్సరాలు. రాజేశ్ భార్యతో నిందితుడు బాలేశ్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో హత్యతో సంబంధం ఉన్న బాలేశ్ సోదరుడు సుందర్‌లాల్‌ను 2004లో అరెస్టు చేశారు పోలీసులు.