Navratri 2023 Why Devotees Dont Eat Onion and Garlic : ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది శరన్నవరాత్రులు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 15, 2023 నుంచి మొదలైన దసరా ఉత్సవాలు(Dussehra Celebrations 2023) 24 వరకు 10 రోజులు, 9 రాత్రులు ఎంతో వైభవంగా కొనసాగనున్నాయి. ఈ సమయంలో భక్తులు అమ్మవారిని తొమ్మిది వేర్వేరు అవతారాల్లో రోజుకో రకంగా అలంకరిస్తూ భక్తి శ్రద్ధలతో విశిష్ట పూజలు చేస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమిని జరుపుకుంటారు. అయితే.. శరన్నవరాత్రుల సమయంలో దేవీ అనుగ్రహం పొందాలంటే భక్తులు ఈ 9 రోజులు కొన్ని నియమాలు పాటిస్తారు. ప్రధానంగా కొన్ని ఆహార పదార్థాలకు భక్తులు దూరంగా ఉంటారు. అందులో ముఖ్యంగా ఉల్లిపాయ, వెల్లుల్లి నిషేధిస్తారు. కానీ, ఎందుకు..? అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
Navratri Fasting Rules 2023 :ఉపవాస సమయంలో సాత్విక ఆహారం ఉత్తమమైనదని ఆయుర్వేద నిపుణులు నమ్ముతారు. ఎందుకంటే అది సులభంగా జీర్ణమవుతుంది. సాధారణంగా ఉపవాసం చేసే సమయంలో తినే ఆహారం జీర్ణం కావడానికి సమయం పడుతుంది. అదే సాత్వికాహారం తీసుకోవడం ద్వారా జీవక్రియ పెరుగుతుంది. రోగనిరోధక శక్తి పనితీరు మెరుగుపడడంతో పాటు చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచే అద్భుత సంజీవని ఈ సాత్వికాహారం. కాబట్టి ఈనవరాత్రుల(Navratri 2023) సమయంలో తినే ఆహారంలో నియమ నిబంధనలు అనుసరిస్తూ.. ఆహార పదార్థాలను వండడం, తినడం సాంప్రదాయ ఆచారంగా మారింది. అయితే ఇంతకీ సాత్విక ఆహారం అంటే ఏమిటి? ఉల్లిపాయ(Onion), వెల్లుల్లి(Garlic) ఎందుకు తినకూడదో ఇప్పుడు చూద్దాం..
నవరాత్రుల్లో ఉపవాసం చేస్తున్నారా? ఇవి తెలుసుకోండి!
Shardiya Navratri 2023 : ఆహార పదార్థాలను మూడు విభిన్న గుణాలుగా ఆయుర్వేదం వర్గీకరిస్తుంది. సాత్విక, రాజసిక్, తామసిక్ అనే మూడు రకాల ఆహార పదార్ధాలుగా పేర్కొన్నారు. ఇక్కడ సాత్విక ఆహారం అంటే స్వచ్ఛమైన, సహజమైన, శక్తివంతమైన ఆహారం అని అర్ధం. సాత్విక ఆహారం.. ఇది స్వచ్ఛమైన శాఖాహార ఆహారం. ఈ ఆహారంలో కాలానుగుణ తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, మొలకలు, పప్పులు, తేనె, తాజా మూలికలు ఉంటాయి. మనస్సును స్వచ్ఛంగా, శరీరాన్ని సమతుల్యంగా ఈ ఆహారం ఉంచుతుంది. అలాగే సాత్విక ఆహారాన్ని తినేవారు ప్రేమ, కృతజ్ఞత, అవగాహనతో ఉంటారు. నిర్మలమైన చిరునవ్వు, ఆరోగ్యం, ఆశ, స్నేహశీలి, శక్తి, ఉత్సాహం, ఆకాంక్షలు, సృజనాత్మకత ఇలా సమతుల్య వ్యక్తిత్వంతో నిండి ఉంటారు.