Navratri Kanya Puja 2023 Date :దేశవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసంలో వచ్చే ఈ నవరాత్రుల్లో శక్తి ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ శారదీయ నవరాత్రుల్లో(Shardiya Navratri 2023) భాగంగా దుర్గాదేవిని 9 రోజుల్లో.. తొమ్మిది రూపాల్లో భక్తులు అత్యంత నియమనిష్ఠలు, భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ పూజల్లో భాగంగానే కన్యా పూజ కూడా చేస్తారు. అమ్మవారికి చిహ్నంగా భావించి.. 9 మంది బాలికలకు ప్రత్యేక పూజలను చేసే సంప్రదాయం ఉంది.
దేవీ శరన్నవరాత్రులలో దుర్గాదేవి స్వరూపంగా భావిస్తూ.. 9 రోజులు ఒక్కొక్క బాలికను కొందరు ఆరాధిస్తారు. మరికొందరు.. నవరాత్రుల ముగింపు రోజున అంటే అష్టమి లేదా నవమి నాడు తొమ్మిది మంది అమ్మాయిలను ఒకేసారి పూజిస్తారు. అయితే.. ఈ సంవత్సరం నవరాత్రుల్లో కన్యా పూజ(Navratri Kanya Puja) ఎప్పుడు వచ్చింది? దాని విశిష్టత ఏంటి? ఏ వయసు బాలికను పూజిస్తే ఎలాంటి శుభ ఫలితం కలుగుతుంది? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
When Is Kumari Puja in Navratri 2023 :ఈ ఏడాది దేవీ శరన్నవరాత్రులు అక్టోబర్ 15 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. అక్టోబర్ 24 వరకు కొనసాగనున్నాయి. నవరాత్రుల్లో ఎనిమిదో రోజు(అష్టమి తిథి) చాలా ముఖ్యమైనది. ఆ రోజు అమ్మవారి ఎనిమిదో రూపమైన మహాగౌరిని పూజించడంతోపాటు కన్యా పూజ కూడా చేస్తారు. దీనినే కొన్ని చోట్ల కుమారి పూజ అని కూడా పిలుస్తారు. అయితే.. ఈ సంవత్సరం అష్టమి తిథి అక్టోబర్ 21, 2023 రాత్రి 9.53 గంటల నుంచి 22, 2023 రాత్రి 7:58 గంటల వరకు ఉంది. తదుపరి నవమి తిథి ఉంది. ఈ రెండు రోజుల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ నేపథ్యంలో.. కన్యా/కుమారి పూజ అంటే ఏమిటో చూద్దాం.
"కుమారి" అనే పదం యుక్తవయస్సులో ఉన్న అమ్మాయిని సూచిస్తుంది. ఆమె దైవిక స్త్రీ శక్తి స్వరూపంగా పరిగణించబడుతుంది. దుర్గాదేవిని సూచిస్తుంది. అందువల్ల ఈ నవరాత్రల వేడుకలో ఆమెను పూజిస్తారు. ఈ పూజను కుమారి పూజ లేదా కుమారి అష్టమి అని కూడా పిలుస్తారు. దేవీ శరన్నవరాత్రులలో పూజించబడే తొమ్మిది మంది బాలికల్లో ఒక్కో వయసు అమ్మాయికి ఒక్కో ప్రాముఖ్యత ఉంది.