Navjot Singh Sidhu sister: పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూపై ఆయన సోదరి సుమన్ తూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ ఆస్తిని దక్కించుకునేందుకు తన తల్లిని ఇంట్లోంచి గెంటేశారని ఆరోపించారు. కొద్ది రోజుల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న తరుణంలో సిద్ధూపై ఇలాంటి విమర్శలు రావటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
చండీగఢ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. తన తల్లి పడిన కష్టాలను వివరించారు ప్రవాస భారతీయురాలు, అమెరికా పౌరసత్వం కలిగిన సుమన్ తూర్. తల్లి నిర్మల భగవత్ పడిన కష్టాన్ని వివరిస్తూ పలుమార్లు భావోద్వేగానికి లోనయ్యారు సుమన్.
" నవజ్యోత్ సింగ్ చాలా కఠినాత్ముడు. ఓ విషాదకర ప్రమాదంలో మా అక్క, కుటుంబ సభ్యులు మరణిస్తే.. కనీసం సంతాపం తెలపలేదు. ఈ విషయంపై సమాధానం చెప్పాలని ప్రజలు, ముఖ్యంగా మహిళలు కోరాలి. 1986లో మా తండ్రి భగవత్ సింగ్ సిద్ధూ మృతి చెందిన తర్వాత మా కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. ఆ తర్వాత కుటుంబ ఆస్తిని దక్కించుకునేందుకు.. నన్ను, మా తల్లిని ఇంట్లోంచి గెంటేశాడు. మాపట్ల క్రూరంగా ప్రవర్తించాడు. ఇంటి నుంచి సమీపంలోని బస్టాండ్‌కు నడుచుకుంటూ వెళ్లింది ఇంకా గుర్తుంది. 1989లో దిక్కులేనిదానిలా దిల్లీ రైల్వేస్టేషన్లో మా తల్లి మరణించింది."