Navjot Singh Sidhu: ఉత్తర్‌ప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం నేపథ్యంలో కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఓటమికి బాధ్యత వహిస్తూ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులు తక్షణమే రాజీనామా చేయాలని ఆదేశించింది. దీంతో ఇప్పటికే ఉత్తరాఖండ్ పీసీసీ అధ్యక్షుడు తన పదవి నుంచి వైదొలగగా.. తాజాగా పంజాబ్ పార్టీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూడా రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ''కాంగ్రెస్ అధ్యక్షురాలు కోరిన విధంగా నేను నా పదవికి రాజీనామా చేశా.'' అని ట్విట్టర్‌లో పేర్కొన్న సిద్ధూ.. రాజీనామా లేఖను పోస్ట్ చేశారు. సిద్ధూ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ పదవి చేపట్టారు.
ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపుర్, గోవా పీసీసీ సారథులపై వేటు వేస్తూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీ విభాగాలను పునర్‌వ్యవస్థీకరించే ప్రయత్నాల్లో భాగంగా ఆమె ఈ ఆదేశాలు జారీ చేసినట్లు కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ట్విట్టర్‌లో మంగళవారం వెల్లడించారు. యూపీలో అజయ్‌కుమార్ లల్లూ, పంజాబ్‌లో నవ్‌జోత్‌సింగ్ సిద్ధూ, ఉత్తరాఖండ్‌లో గణేశ్ గోదియాల్, మణిపుర్‌లో ఎన్.లోకెన్‌సింగ్, గోవాలో గిరీశ చోడంకర్ పీసీసీ అధ్యక్షులుగా ఉన్నారు.
Sonia Gandhi PCC chiefs resign: సోనియా ఆదేశాలు వెలువడిన కొద్ది గంటల్లోనే ఉత్తరాఖండ్‌లో గణేశ్ గోదియాల్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి వైదొలిగారు. రాష్ట్రంలో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ తాను రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్‌లో ప్రకటించారు. తాజాగా సిద్ధూ పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పుకొన్నారు.