పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ(Navjot Singh Sidhu news).. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తనకు పెద్దన్న లాంటి వారని అన్నారు. కర్తార్‌పుర్‌ను సందర్శించడానికి పాక్ వెళ్లిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై భాజపా తీవ్ర స్థాయిలో మండిపడింది. సిద్ధూ మాటలు ఆందోళన కలిగించేలా ఉన్నాయని భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఆరోపించారు. ఐఎస్, బోకోహారం సంస్థలను హిందుత్వతో ముడిపెట్టిన కాంగ్రెస్ నేతలు.. ఇమ్రాన్‌ను మాత్రం పెద్దన్న అని పిలవడం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు(Navjot Singh Sidhu latest news ). హిందుత్వపై విమర్శలు గుప్పించే రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతల తరహాలోనే సిద్ధూ మాట్లాడారని విమర్శించారు. కేవలం బుజ్జగింపు రాజకీయాల కోసమే కాంగ్రెస్ నేతలు ఇలాంటి వ్యాఖ్యాలు చేస్తారన్నారు. పాకిస్థాన్‌ను పొగిడితే భారత్‌లో ఓ వర్గం సంతోషిస్తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తారని, కానీ అలాంటి వారు ఇక్కడ లేరనే విషయం ఆ పార్టీ తెలుసుకోవాలని హితవు పలికారు.
భాజపా ఐటీ సెల్ ఇంఛార్జ్, బంగాల్ కో-ఇన్ఛార్జ్ అమిత్ మాలవీయ కూడా ట్విట్టర్ వేదికగా సిద్ధూపై ధ్వజమెత్తారు.
" రాహుల్ గాంధీకి ఎంతో ఇష్టమైన నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. పాక్ ప్రధానిని బడా భాయ్ అన్నారు. పోయినసారి పాక్ ఆర్మీ చీఫ్ భజ్వాను ఆలింగనం చేసుకుని ప్రశంసలు కురిపించారు. సీనియర్ నేత అమరీందర్ సింగ్‌ను కాదని గాంధీ సోదరులు సిద్ధూను ఎంచుకోవడంలో ఆశ్చర్యమేముంది?"
-అమిత్ మాలవియ ట్వీట్.
తప్పేముంది...
పాక్ ప్రధానిని సోదరుడు అని సిద్ధూ(Navjot Singh Sidhu latest news ) పిలిస్తే తప్పేంటని పంజాబ్ మంత్రి పర్గత్ సింగ్ ప్రశ్నించారు. ప్రధాని మోదీ పాకిస్థాన్‌కు వెళ్తే మాత్రం దేశ ప్రేమికుడు అని అంటారు, సిద్ధూ వెళ్తే మాత్రం దేశ ద్రోహి అంటారా? అని మండిపడ్డారు. సోదరుడు అని పిలవడం తప్పా? అన్నారు. గురునానక్ దేవ్ సిద్ధాంతాలనే తాము అనుసరిస్తామని పేర్కొన్నారు.