తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మరోసారి సిక్సర్‌ కొట్టిన సిద్ధూ! - పంజాబ్​ పీసీసీ అధ్యక్షుడు

పంజాబ్​ కాంగ్రెస్​ రాజకీయాల్లో కీలకంగా మారిన నవజోత్‌ సింగ్‌ సిద్ధూ.. ఇప్పుడు ఆ రాష్ట్ర కాంగ్రెస్​ కమిటీ అధ్యక్షులుగా పగ్గాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో క్రికెటర్​ నుంచి పీసీసీ చీఫ్​ వరకు 'సిక్సర్​ సిద్ధూ' ప్రయాణం సాగింది ఇలా..

navjot singh sidhu congress
మరోసారి సిక్సర్‌ కొట్టిన సిద్ధూ!

By

Published : Jul 19, 2021, 5:30 PM IST

అది క్రికెట్‌ మైదానం అయినా.. టీవీ షో అయినా.. రాజకీయాలైనా.. నవజోత్‌ సింగ్‌ సిద్ధూ అలియాస్‌ 'సిక్సర్‌ సిద్ధూ' క్యారెక్టర్‌ ఒక్కటే. గ్రౌండ్‌లో సిక్సర్లతో విరుచుకుపడుతూ అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తడం సహా రాజకీయ జీవితంలో తన పదునైన పంచ్‌లతో ప్రజలను ఆకట్టుకుని విమర్శకులను విస్మయానికి గురిచేయడంలో ఆయనకు ఆయనే సాటి. చురుకైన స్వభావం, దూకుడు మనస్తత్వంతో క్రికెటర్‌ నుంచి రాజకీయ నాయకుడిగా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన సిద్ధూ.. ఇప్పుడు పంజాబ్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు.

తండ్రి కోరిక మేరకు బ్యాట్‌పట్టి..

సిద్ధూ స్వస్థలం పంజాబ్‌లోని పటియాలా. ఆయన తండ్రి భగవంత్‌సింగ్‌ కూడా క్రికెటరే. సిద్ధూను టాప్‌ క్లాస్‌ క్రికెటర్‌గా చూడాలని భగవంత్‌ అనుకునేవారు. అలా తండ్రి కోరిక మేరకు క్రికెట్‌లో శిక్షణ తీసుకున్న ఆయన.. 1981లో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అరంగేట్రం చేశారు. తొలి మ్యాచ్‌లోనే అర్ధశతకం నమోదుచేసి అదరగొట్టారు. 1983లో భారత టెస్టు క్రికెట్‌ జట్టుకు ఎంపికయ్యారు. అయితే ఆరంభంలో జాతీయ జట్టులో అంతగా రాణించకపోవడం వల్ల జట్టు నుంచి తప్పించారు. ఆ తర్వాత నాలుగేళ్లకు ప్రపంచకప్‌ కోసం సిద్ధూను మళ్లీ జాతీయ జట్టులోకి తీసుకున్నారు. ఆ సమయంలో వన్డేల్లో తొలి మ్యాచ్‌లోనే ఐదు సిక్సులు, నాలుగు ఫోర్లు బాది ఔరా అనిపించారు. అప్పటి నుంచి సిద్ధూ సిక్సర్ల మోత కొనసాగింది.

విభేదాలతో టూర్‌ను మధ్యలోనే వదిలి..

1996లో భారత జట్టు ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లింది. ఆ సమయంలో కెప్టెన్‌ అజారుద్దీన్‌తో విభేదాలు రావడం వల్ల సిద్ధూ టోర్నీని మధ్యలోని వీడి ఇంగ్లాండ్‌ నుంచి తిరిగొచ్చారు. అప్పట్లో ఇది సంచలనమైంది. ఈ చర్యలతో బీసీసీఐ ఆయనపై 10 టెస్టు మ్యాచ్‌ల నిషేధం విధించింది. ఆ తర్వాత మళ్లీ మైదానంలోకి వచ్చిన సిద్ధూ.. ఏకంగా డబుల్‌ సెంచరీ కొట్టారు. 18 ఏళ్ల పాటు క్రికెటర్‌గా అలరించిన సిద్ధూ 1999లో అనూహ్యంగా ఆటకు వీడ్కోలు పలికారు.

కామెడీ కింగ్‌..

క్రికెట్‌ను వీడిన తర్వాత సిద్ధూ కామెంటేటర్‌ అవతారమెత్తారు. తొలినాళ్లలో పలు క్రికెట్‌ మ్యాచ్‌లకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆ తర్వాత సీరియళ్లు, షోలతో బుల్లితెరలో తనదైన ముద్ర వేశారు. సిద్ధూకు కామెడీ అంటే చాలా ఇష్టం. అందుకే పలు కామెడీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ప్రముఖ కమెడియన్‌ కపిల్‌ శర్మ నిర్వహిస్తోన్న షోకు చాలా కాలం పాటు జడ్జీగా ఉన్నారు. కొన్ని సినిమాల్లో అతిథి పాత్రల్లో నటించారు.

లోక్‌సభ టు అసెంబ్లీ..

టీవీ షోలతో విశేష ప్రేక్షకాదరణ పొందిన సిద్ధూ 2004లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున అమృత్‌సర్‌ నుంచి విజయం సాధించారు. 2014 వరకు ఇదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2014లో అమృత్‌సర్‌ స్థానాన్ని దివంగత నేత అరుణ్‌జైట్లీకి కేటాయించడం కోసం సిట్టింగ్‌ ఎంపీ అయిన సిద్ధూకు భాజపా టికెట్ ఇవ్వలేదు. ఆ తర్వాత 2016లో భాజపా తరఫున రాజ్యసభకు పంపారు. అయితే 2017లో పంజాబ్‌ ఎన్నికల ముందు ఆయన భాజపాకు, రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. ఆ పార్టీ తరఫున అమృత్‌సర్‌ తూర్పు నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2017 నుంచి 2019 వరకు అమరీందర్‌ సింగ్‌ మంత్రివర్గంలో స్థానిక సంస్థలు, పర్యాటకం, సాంస్కృతికశాఖ మంత్రిగా పనిచేశారు.

సీఎంతో వైరం..

ఎలాంటి రాజకీయ చరిత్ర లేనప్పటికీ తన వాక్చాతుర్యంతోనే ప్రజల్లో సిద్ధూ మంచి ముద్ర వేసుకున్నారు. ఆయన పాపులారీటి చూసి రాహుల్‌ గాంధీ.. సిద్ధూను పార్టీలోకి తీసుకున్నారు. అనతికాలంలోనే కాంగ్రెస్‌లో సిద్ధూ పేరు మార్మోగింది. అయితే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌కు ఇది ఇబ్బందిగా మారింది. దీంతో ఇరువురి మధ్య విభేదాలు రాజుకున్నాయి. అదే సమయంలో సిద్ధూ.. సీఎం అభీష్టానికి వ్యతిరేకంగా పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ ప్రమాణ స్వీకారానికి వెళ్లడం సహా, అక్కడ ఆ దేశ సైన్యాధ్యక్షుడిని కౌగిలించుకోవడం భారత్‌లో పెద్ద దుమారం రేపింది. ఆ తర్వాత 2019 సాధారణ ఎన్నికల్లో తన భార్యకు ఎంపీ టికెట్‌ రాకుండా చేయడంలో అమరీందర్‌ ప్రోద్బలం ఉందని ఆయనతోపాటు, సతీమణి కూడా బహిరంగంగా ఆరోపించారు. దాంతో ఇద్దరి మధ్య అగాధం పెరిగిపోయింది. సీఎంతో పొసగని సిద్ధూ 2019లో మంత్రిపదవికి రాజీనామా చేశారు.

స్నేహం కోసం వెళ్లి.. వివాదాల్లోకెక్కి

పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌తో సిద్ధూకు మంచి సంబంధాలున్నాయి. క్రికెట్‌ రోజుల నుంచే వీరిద్దరూ మంచి మిత్రులు. ఆ స్నేహంతోనే 2018లో ఇమ్రాన్‌ఖాన్‌ ప్రమాణస్వీకారానికి సిద్ధూ అతిథిగా వెళ్లారు. ఆ తర్వాత అదే ఏడాది భారత్‌-పాక్‌ మధ్య కర్తార్‌ఫూర్‌ కారిడార్‌ను తెరవాలని పాక్‌ నిర్ణయించింది. ఆ సమయంలోనూ ఇమ్రాన్‌ఖాన్‌పై సిద్ధూ ప్రశంసలు కురిపించారు. ఇక 2019లో పుల్వామాలో భారత జవాన్లపై ఉగ్రదాడి జరిగినప్పుడు సిద్ధూ పాక్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేయడం పెను వివాదానికి దారితీసింది. ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

నోరు తెచ్చిన పదవి..

సిద్ధూ మంచి వాగ్ధాటి గల నేత. తన పంచ్‌ డైలాగులతో ఎన్నికల ర్యాలీల్లో ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటారు. విషయం ఏదైనా కుండబద్ధలు కొట్టినట్లు చెబుతారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో నోరున్నవారైతేనే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లగలనే సత్యాన్ని కాంగ్రెస్‌ గుర్తించింది. మరో ఆరు నెలల్లో పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో సిద్ధూని కోల్పోతే భారీ మూల్యం తప్పదని కాంగ్రెస్‌ పెద్దలు ముఖ్యంగా సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకా వాద్రాలకు తెలుసు. అందుకే సీఎం అమరీందర్‌ సింగ్‌ వర్గం వ్యతిరేకించినా సరే.. అధిష్ఠానం సిద్ధూకు పీసీసీ అధ్యక్ష పదవిని కట్టబెట్టింది.

మరి ఇకనైనా సిద్ధూ-కెప్టెన్‌ వివాదం సద్దుమణుగుతుందా? పీసీసీ అధ్యక్షుడిగా సిద్ధూ సారథ్యంలో పంజాబ్‌లో మరోసారి కాంగ్రెస్‌ జెండా ఎగురుతుందా తెలియాలంటే ఎన్నికల దాకా ఆగాల్సిందే..!!

ఇదీ చదవండి :రిటైర్మెంట్​ వయసులో 10వ తరగతి పరీక్ష

ABOUT THE AUTHOR

...view details