రానున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మహిళలపై 'ఉచిత' హామీల వర్షాన్ని కురిపించింది కాంగ్రెస్ పార్టీ. తాము అధికారంలోకి వస్తే.. గృహిణులకు నెలకు రూ. 2వేలు ఇస్తామని ప్రకటించింది. అంతేగాకుండా గృహ అవసరాలకు సంబంధించి ఏడాదికి.. 8 ఎల్పీజీ సిలిండర్లను ఉచితంగా అందించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ వెల్లడించారు.
ఇదే క్రమంలో విద్యార్థులకు కూడా ఉచిత ప్రథకాలను ప్రకటించారు సిద్ధూ. కాలేజీలో అడ్మిషన్ పొందిన వెంటనే బాలికలకు ద్విచక్ర వాహనాలు అందిస్తామని తెలిపారు. ఇంటర్ పాసైన విద్యార్థులకు రూ.20వేలు, 10వ తరగతి పాసైన వారికి రూ.15వేలు, 5వ తరగతి పాసైన వారికి రూ.5వేలు ఇస్తామని హామీ ఇచ్చారు.
పంజాబ్లోని బర్నాలా జిల్లాలో నిర్వహించిన ఓ ర్యాలీలో పాల్గొన్న సిద్ధూ ఈ హామీలను ఇచ్చారు. మహిళా సాధికారత కోసం ఈ హామీలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. పంజాబ్లో తాము అధికారంలోకి వస్తే మహిళలకు నెలవారీ రూ.1,000 ఇస్తామని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో.. అంతకుమించి సిద్ధూ హామీలు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మహిళా విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఉచితంగా లాప్టాప్లను ఇవ్వనున్నట్లు ప్రకటించారు సిద్ధూ. మహిళల పేరుపై ఆస్తులను బదిలీ చేసే ప్రక్రియను ఉచితంగా చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళల శిక్షణకు 28 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.