మహారాష్ట్రలోని నవీముంబయిలో అమానుష ఘటన జరిగింది. చదువుకోమని ఒత్తిడి తెచ్చిన తల్లిని కుమార్తె హత్య చేసింది. కరాటే బెల్టును తల్లి మెడ చుట్టూ బిగించి ఈ దారుణానికి పాల్పడింది. మైనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చదువుకోమంటే చంపేసింది..
నవీముంబయిలో నివసించే సంతోష్ జాదవ్ (44), శిల్పా జాదవ్ (40) దంపతులకు 15 ఏళ్ల కుమార్తె, 6 ఏళ్ల కుమారుడు ఉన్నారు. కుమార్తెను డాక్టర్ చేయలన్నది వారి కల. ఇందుకోసం వారు బాలికను ఈ ఏడాది మే నెలలో నీట్ కోచింగ్‌లో చేర్చారు. కుమార్తెను చదువుకోమని తల్లి ఎప్పుడూ చెబుతూ ఉండేది. ఈ క్రమంలో వారి మధ్య అనేక సార్లు గొడవలు అయ్యాయి. ఒకానొక సందర్భంలో వీరి మధ్య తగాదా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. తల్లిదండ్రులు తనను మందలించారని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఆ బాలిక సిద్ధమైంది. బాలికను తీసుకుని తల్లి ఠాణాకు వెళ్లగా పోలీసులు వారికి సర్దిచెప్పి పంపించేశారు. జులై 27న ఈ ఘటన జరిగింది.
జులై 30న బాలిక తండ్రి సంతోష్ ఇంట్లోలేని సమయంలో తల్లి, కూతురు మధ్య మరోసారి గొడవైంది. కుమార్తె తీరుపై ఆగ్రహం చెందిన శిల్పా.. ఆమెను దండించింది. తల్లి చర్యకు ప్రతిగా.. బాలిక ఆమెపై దాడికి దిగింది. తల్లిని బలంగా వెనక్కి నెట్టగా ఆమె తలకు తీవ్రగాయాలు అయ్యాయి. అనంతరం బాలిక.. తల్లి మెడకు కరాటే బెల్ట్‌ను చుట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసింది. తల్లి చనిపోయిందని నిర్ధరణ అయ్యే వరకు ఆమె తన పట్టును వదల్లేదు.
ఆత్మహత్య చేసుకుంటున్నాను అంటూ..
తల్లి హత్య అనంతరం కుమార్తె.. తండ్రికి తాను చనిపోతున్నాను అంటూ తల్లి ఫోన్ నుంచి మెసేజ్ చేసింది. దీంతో కంగారు పడ్డ తండ్రి.. సమీపాన ఉండే బాలిక మేనమామకు సమాచారం ఇచ్చాడు. బాలిక ఇంటికి చేరుకున్న అతను అక్కడి పరిస్థితి చూసి కంగుతిన్నాడు. మెడకు కరాటే బెల్ట్ చుట్టుకుపోయి బాలిక తల్లి విగత జీవిగా పడి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. శిల్ప మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించగా.. ఆమె హత్యకు గురైందని వెల్లడైంది. కుటుంబసభ్యలను విచారిస్తున్న క్రమంలో.. తానే తల్లిని హత్య చేసినట్లు బాలిక వెల్లడించింది. దీంతో మైనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి :గాంధీలు లేకుండా విపక్ష నేతలకు సిబల్ విందు- దేనికి సంకేతం?