Naveen Murder Case Updates: నవీన్ హత్య కేసులో ఆధారాలు చెరిపివేసేందుకు హరిహర కృష్ణకు మరో ఇద్దరు సహకరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. హరిహర కృష్ణ స్నేహితుడు హసన్‌తో పాటు, స్నేహితురాలని కూడా పోలీసులు నిందితులుగా చేర్చారు. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు... హయత్ నగర్ కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు. గత నెల 17వ తేదీన నవీన్‌ను హరిహరకృష్ణ అబ్దుల్లాపూర్ మెట్‌లోని నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత హత్య చేసి తల, గుండె, చేతి వేళ్లు, మర్మాంగాలు శరీరం నుంచి వేరు చేసి వాటిని సంచిలో వేసుకొని ద్విచక్ర వాహనంపై బ్రాహ్మణపల్లిలోని హసన్ ఇంటికి వెళ్లాడు.
హసన్‌తో కలిసి హరిహర కృష్ణ, శరీర అవయవాలను మన్నెగూడ పరిసరాల్లో పడేశాడు. ఆ తర్వాత హసన్ ఇంటికి చేరుకొని దుస్తులను మార్చుకొని రాత్రి అక్కడే ఉండి, 18వ తేదీ ఉదయం బీఎన్ రెడ్డి నగర్‌లో ఉండే స్నేహితురాలి వద్దకు వెళ్లాడు. ఆమెకు నవీన్‌ను హత్య చేసిన విషయం తెలిపి.. ఖర్చుల కోసం 1500రూపాయలు తీసుకొని వెళ్లాడు. ఆ తర్వాత ఫోన్‌లో యువతితో, హసన్‌తో సంప్రదింపులు జరిపాడు.
20వ తేదీ సాయంత్రం మరోసారి యువతి వద్దకు వెళ్లి ఆమెను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని నవీన్‌ను హత్య చేసిన ప్రాంతానికి తీసుకెళ్లాడు. దూరం నుంచి నవీన్ మృతదేహాన్ని చూపించాడు. ఇద్దరూ కలిసి రెస్టారెంట్‌కు వెళ్లి బిర్యానీ తిన్న తర్వాత నిహారికను హరిహరకృష్ణ ఇంటి వద్ద వదిలేసి వెళ్లాడు. 21వ తేదీ నవీన్ కుటుంబ సభ్యులు హరిహరకృష్ణకు ఫోన్ చేసి తమ కుమారుడి ఆచూకీ గురించి ఆరా తీయడంతో హత్య విషయం బయటపడుతుందనే భయంతో పారిపోయాడు.
ఖమ్మం, విజయవాడ, వైజాగ్‌లో తలదాచుకొని 23వ తేదీ వరంగల్‌లో తండ్రి వద్దకు చేరుకున్నాడు. అప్పటికే పోలీసులు హరిహరకృష్ణ కోసం గాలిస్తున్నట్లు తండ్రికి తెలియడంతో... వెంటనే పోలీసులకు లొంగి పోవాల్సిందిగా కుమారుడికి సూచించాడు. 24వ తేదీ హరిహర కృష్ణ హైదరాబాద్‌కు వచ్చి హసన్ వద్దకు వెళ్లాడు. ఆధారాలు చెరిపివేసేందుకు నవీన్ మృతదేహాన్ని తగులబెట్టాలని హరిహర కృష్ణను హసన్ సూచించాడు. అంతేకాకుండా మన్నెగూడలో పడేసిన నవీన్ తల, ఇతర అవయవాలను సంచిలో తీసుకొచ్చిన హసన్ వాటిని హరిహరకు ఇచ్చాడు.