తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సోదాలు.. ఆ నిధుల మళ్లింపుపై నజర్!

National Herald ED raids: నేషనల్ హెరాల్డ్ కేసులో సోదాలు చేపట్టింది ఈడీ. దిల్లీలోని సంస్థ ప్రధాన కార్యాలయం సహా సుమారు 12 ప్రాంతాల్లో దాడులు చేసినట్లు అధికారులు తెలిపారు. పలు లావాదేవీలకు సంబంధించిన సమాచారం సేకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అయితే, తాజా దాడులు రాజకీయ ప్రేరేపితమైనవేనని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రతీకార చర్యల్లో భాగంగా కాంగ్రెస్​ను లక్ష్యంగా చేసుకున్నారని ఆ పార్టీ ధ్వజమెత్తింది.

national-herald-money-laundering
national-herald-money-laundering

By

Published : Aug 2, 2022, 12:50 PM IST

Updated : Aug 2, 2022, 2:26 PM IST

National Herald ED raids :నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్​కు సంబంధించిన కేసులో ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ దిల్లీలో సోదాలు చేపట్టింది. సెంట్రల్ దిల్లీలో ఉన్న నేషనల్ హెరాల్డ్ ప్రధాన కార్యాలయం 'హెరాల్డ్ హౌస్' సహా సుమారు 12 ప్రాంతాల్లో దాడులు చేపట్టినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ కేసులో ఇటీవలే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించిన నేపథ్యంలో.. తాజా సోదాలకు ప్రాధాన్యం ఏర్పడింది.

హెరాల్డ్ హౌస్​లో ఈడీ

National Herald case:
మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం సోదాలు జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. దర్యాప్తులో వెలుగు చూసిన నిధుల మళ్లింపు విషయమై మరింత సమాచారం సేకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. 'ఈ కేసులో ఇటీవల కొందరిని ప్రశ్నించిన తర్వాత లభించిన ఆధారాలను బట్టి తాజా చర్యలు చేపట్టాం. నేషనల్ హెరాల్డ్ లావాదేవీల్లో భాగమైన సంస్థలతో పాటు నిధుల మళ్లింపునకు సంబంధించిన అదనపు ఆధారాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నాం' అని అధికారులు వెల్లడించారు.

నేషనల్ హెరాల్డ్ కార్యాలయంలో అధికారులు..

'మనీలాండరింగ్ జరగలేదు'
అయితే, ఈడీ దాడులపై కాంగ్రెస్ మండిపడింది. తాజా చర్యలను ఖండించింది. నేషనల్ హెరాల్డ్ విషయంలో మనీలాండరింగ్ జరగలేదని స్పష్టం చేసింది. రాజకీయ ప్రతీకార చర్యల్లో భాగంగానే దాడులు చేయిస్తున్నారంటూ ధ్వజమెత్తింది. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకే కాంగ్రెస్​ను లక్ష్యంగా చేసుకున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆరోపించారు. అయినా, తమను ఎవరూ నిశబ్దంగా ఉంచలేరని చెప్పారు.

ఏంటీ కేసు?
కాంగ్రెస్‌కు నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు యంగ్‌ ఇండియన్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్యస్వామి గతంలో ఆరోపించారు. ఇందుకు సంబంధించి సోనియా, రాహుల్‌ సహా ఏడుగురిపై దిల్లీలోని అడిషనల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో స్వామి కేసు దాఖలు చేశారు. కేవలం రూ.50 లక్షల చెల్లింపుతో ఆ హక్కును పొందేందుకు వారు యత్నించారని పిటిషన్‌లో ఆరోపించారు.

ఈ కేసులో కాంగ్రెస్ నేతు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, పవన్ బన్సల్​లను ఈడీ ప్రశ్నించింది. మూడు రోజుల విచారణలో భాగంగా సోనియాకు వందకు పైగా ప్రశ్నలు సంధించింది. నేషనల్‌ హెరాల్డ్‌ పబ్లిషర్‌ అయిన అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజేఎల్‌) టేకోవర్‌కు సంబంధించిన లావాదేవీల గురించి సోనియాను ప్రశ్నించగా.. అవన్నీ మోతీలాల్‌ వోరాకే తెలుసని ఆమె చెప్పినట్లు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్‌, ఏజేఎల్‌, యంగ్‌ ఇండియన్‌ మధ్యలో జరిగిన ఆర్థిక లావాదేవీలన్నీ ఆయనే చూసుకున్నారని ఆమె చెప్పినట్లు సమాచారం. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అయిన మోతీలాల్‌ వోరా.. మధ్యప్రదేశ్‌ సీఎంగా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌గా, ఆలిండియా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా అనేక బాధ్యతలు నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ కోశాధికారిగానూ వ్యవహరించారు. 2020 డిసెంబరులో ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు.

Last Updated : Aug 2, 2022, 2:26 PM IST

ABOUT THE AUTHOR

...view details