Sonia Gandhi ED case: నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం మూడు గంటల పాటు ప్రశ్నించింది. ఇప్పటికే రెండు రోజులు సోనియాను విచారించిన ఈడీ.. బుధవారం కేసుకు సంబంధించి మరిన్ని ప్రశ్నలు సంధించింది. కొత్తగా ఎలాంటి సమన్లు జారీ చేయలేదని అధికారులు తెలిపారు. అవసరమైతే మళ్లీ పిలుస్తామని చెప్పారు.
సెంట్రల్ దిల్లీలోని ఈడీ కార్యాలయానికి ఉదయం 11 గంటలకు సోనియా గాంధీ చేరుకున్నారు. కుమార్తె ప్రియాంకా గాంధీ, కుమారుడు రాహుల్ గాంధీ ఆమె వెంట వెళ్లారు. 11.15 గంటలకు ఈడీ విచారణ ప్రారంభమైంది. కేసు విచారణ జరుపుతున్న కీలక అధికారి.. సోనియాను ప్రశ్నలు అడిగారు. మరో అధికారి ఆమె చెప్పిన సమాధానాలను రాసుకున్నారు.
మధ్యాహ్నం 2 గంటలకు భోజన విరామం కోసం సోనియా ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. మధ్యాహ్నం 3.30కి మరోసారి రావాలని అధికారులు తొలుత సమాచారం ఇచ్చారు. అయితే, విచారణ ముగిసిందని, ప్రస్తుతానికైతే ఈడీ కార్యాలయానికి రావాల్సిన పని లేదని పేర్కొన్నారు. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని సోనియాకు చెప్పినట్లు సమాచారం. సోనియాను ఇప్పటివరకు 95 నుంచి 110 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిన సోనియా.. మరికొన్నింటికి తనకు తెలియవని చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
నేషనల్ హెరాల్డ్ పబ్లిషర్ అయిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) టేకోవర్‌కు సంబంధించిన లావాదేవీల గురించి సోనియాను ప్రశ్నించగా.. అవన్నీ మోతీలాల్ వోరాకే తెలుసని ఆమె చెప్పినట్లు ఈడీ వర్గాలు మంగళవారం పేర్కొన్నాయి. కాంగ్రెస్, ఏజేఎల్, యంగ్ ఇండియన్ మధ్యలో జరిగిన ఆర్థిక లావాదేవీలన్నీ ఆయనే చూసుకున్నారని ఆమె చెప్పినట్లు సమాచారం. కాంగ్రెస్ సీనియర్ నేత అయిన మోతీలాల్ వోరా.. మధ్యప్రదేశ్ సీఎంగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా, ఆలిండియా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా అనేక బాధ్యతలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కోశాధికారిగానూ వ్యవహరించారు. 2020 డిసెంబరులో ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు.