Rahul Gandhi ED probe:కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి సమన్లు జారీ చేసింది. మంగళవారం సైతం ఈడీ కార్యాలయానికి రావాలని స్పష్టం చేసింది. నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో ఆయన్ను ఈడీ విచారిస్తోంది. సోమవారం సైతం రాహుల్‌ను ఈడీ ప్రశ్నించింది. ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంది. సోమవారం విచారణకు నాలుగో రోజు కాగా.. ఇప్పటివరకు 38 గంటల పాటు రాహుల్‌ను ఈడీ విచారించింది.
National Herald Rahul Gandhi:ఆదివారం రాహుల్ గాంధీ 52వ పుట్టినరోజు కాగా.. ఆ తర్వాతి రోజే ఈడీ ముందు హాజరయ్యారు. జూన్ 17న ఈడీ విచారణకు హాజరైన రాహుల్.. రెండ్రోజులు విరామం ఇవ్వాలని అధికారులను కోరారు. తన తల్లి సోనియా గాంధీ అస్వస్థతకు గురైన నేపథ్యంలో విరామం కోరారు రాహుల్. ఈ నేపథ్యంలో రాహుల్‌ను సోమవారం రావాలని ఈడీ పేర్కొంది. ఈ ప్రకారం.. సోమవారం ఉదయం 11.05 గంటలకు ఏపీజే అబ్దుల్ కలాం రోడ్లో ఉన్న ప్రధాన కార్యాలయానికి రాహుల్ వెళ్లారు. గతవారం తరహాలోనే ఈడీ ఆఫీస్ పరిసరాల్లో అధికారులు 144 సెక్షన్ విధించారు. భారీ సంఖ్యలో పోలీసులను, పారామిలిటరీ సిబ్బందిని మోహరించారు. మధ్యాహ్నం 3.45 గంటలకు భోజన విరామం తీసుకున్న రాహుల్.. 4.45 గంటలకు మళ్లీ ఈడీ ఆఫీస్‌కు వెళ్లారు.