నేషనల్ హెరాల్డ్ కేసులో మూడో రోజు విచారణకు హాజరైన రాహుల్ గాంధీని మూడు గంటల పాటు విచారించారు అధికారులు. అనంతరం మధ్యాహ్నం 3:00గంటల సమయంలో భోజన విరామానికి అనుమతి ఇచ్చారు. దీంతో రాహుల్ తన నివాసానికి వెళ్లారు. కాసేపయ్యాక తిరిగి ఈడీ కార్యాలయం చేరుకున్నారు. ఆ తర్వాత అధికారులు మళ్లీ విచారణ కొనసాగిస్తున్నారు. మొత్తం మూడు రోజుల్లో రాహుల్‌ను ఇప్పటికే 24 గంటలకుపైగా విచారించారు అధికారులు. విచారణ ఇంకా పూర్తి కాలేదు.
మూడో రోజు ఈడీ విచారణ.. రాహుల్‌కు వరుస ప్రశ్నలు! - రాహుల్ గాంధీ ఈడీ విచారణ
15:34 June 15
12:44 June 15
టైర్లు తగలబెట్టిన కార్యకర్తలు..
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై విచారణకు నిరసనగా ఈడీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. టైర్లు తగలబెట్టారు.
12:19 June 15
కాంగ్రెస్ కార్యకర్తల నిరసన.. అదుపులోకి తీసుకున్న పోలీసులు
నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి వరుసగా మూడో రోజు.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించడాన్ని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా నిరసిస్తున్నారు. దిల్లీలోని ఏఐసీసీ ఆఫీసు ఎదుట బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ముందుగానే ఆ ప్రాంతంలో మోహరించిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు. 'మేము ఉగ్రవాదులమా? మమ్మల్ని చూసి ఎందుకు భయపడుతున్నారు?' అని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి.. పోలీసులపై మండిపడ్డారు.
12:02 June 15
కాంగ్రెస్ మహిళా కార్యకర్తల నిరసన..
దిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ పార్టీ మహిళా నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. జిందాబాద్.. రాహుల్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఆందోళన చేపడుతున్న వారిని పోలీసులు.. అదుపులోకి తీసుకున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి రాహుల్ గాంధీ.. వరుసగా మూడో రోజు ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు.
11:14 June 15
మూడో రోజు ఈడీ విచారణ..
Rahul Gandhi Ed: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని గత రెండు రోజుల పాటు విచారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. వరుసగా మూడో రోజూ విచారణకు రావాలని ఆదేశించింది. దీంతో బుధవారం కూడా ఆయన ఈడీ ఎదుట హాజరయ్యారు. కాగా.. గత రెండు రోజుల్లో దాదాపు 21 గంటల పాటు రాహుల్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. రాహుల్ విచారణ నేపథ్యంలో కాంగ్రెస్ నిరసనలు ఉద్ధృతంగా మారాయి.
పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద రాహుల్ గాంధీ స్టేట్మెంట్ను.. ఈడీ అధికారులు రికార్డు చేస్తున్నారు. రాహుల్ సమాధానాలపై ఈడీ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఆర్ధిక లావాదేవీలు, బ్యాంకు లావాదేవీల గురించి సరైన సమాధానాలు ఇవ్వడం లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు ఆయన 80 ప్రశ్నలకు సమాధానాలు చెప్పినట్లు వెల్లడించాయి. అయితే, రాహుల్ పదేపదే తన వాంగ్మూలాన్ని మార్చుకోవడం వల్ల విచారణ ఆలస్యమైందని సదరు వర్గాలు పేర్కొన్నాయి.
తల్లిని చూసేందుకు ఆసుపత్రికి వెళ్లి..
మంగళవారం ఉదయం 11 గంటలకు రాహుల్ ఈడీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. న్యాయపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత 11.30 నుంచి ఈడీ ఆయన్ను ప్రశ్నించింది. మధ్యలో గంటపాటు భోజన విరామమిచ్చారు. రాత్రి 11.30 గంటల వరకు ఈ విచారణ కొనసాగింది. అర్ధరాత్రి సమయంలో ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన రాహుల్.. తల్లి సోనియా గాంధీని చూసేందుకు నేరుగా ఆసుపత్రికి వెళ్లారు. ఆయన వెంట సోదరి ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఉన్నారు. కొవిడ్ సంబంధిత సమస్యలతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఇటీవలే సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు.
కొనసాగుతున్న ఆందోళనలు..
రాహుల్‌పై ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ దిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన చేపడుతున్నారు. బుధవారం కూడా కాంగ్రెస్ ఆందోళన కొనసాగుతోంది. అయితే సోమవారం జరిగిన ఉద్రిక్త ఘటనల దృష్ట్యా ఈడీ కార్యాలయం సహా రాహుల్ నివాసం, కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈడీ ఆఫీస్ చుట్టూ 144 సెక్షన్ విధించారు.