ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జనాభా (Census of India) గల దేశంగా పేరొందిన భారత్‌లో గత కొన్నేళ్లుగా జనాభా తగ్గుముఖం పడుతోందని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5 తాజా గణాంకాలు వెల్లడించాయి. 2019-21లో సగటు భారతీయ మహిళ (India sex ratio) ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. దేశ సంతానోత్పత్తి రేటులో ఇప్పటి వరకు నమోదైన అత్యల్ప స్థాయి ఇది. అంతేగాక తొలిసారిగా సంతానోత్పత్తి రేటు (టీఎఫ్‌ఆర్).. రీప్లేస్‌మెంట్ రేటు కంటే దిగువకు పడిపోవడం ఓ మైలురాయి అని సర్వే చెబుతోంది.
నేషనల్ ఫ్యామిలీ హెల్త్ ఐదో ఎడిషన్ సర్వేను 2019-21 మధ్య నిర్వహించారు. ఆ వివరాలను రెండు విడతలుగా విడుదల చేశారు. తొలి విడత గణాంకాలను గతేడాది డిసెంబరులో బయటపెట్టగా.. రెండో విడత వివరాలను బుధవారం వెల్లడించారు.
- దేశంలో సంతానోత్పత్తి రేటు 2గా ఉంది- అంటే 2019-21లో సగటు భారతీయ మహిళ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది.
- 2015-16లో నిర్వహించిన నాలుగో ఎడిషన్ సర్వేలో సంతానోత్పత్తి రేటు 2.2 శాతంగా ఉండగా.. ఇప్పుడు మరింత తగ్గింది.
రీప్లేస్‌మెంట్ రేటు (Replacement fertility rate) అంటే జనాభాలో ఎటువంటి తగ్గుదల, పెరుగుదల ఉండకపోవడం. దేశంలో జనన, మరణాలను బ్యాలెన్స్ చేసే స్థాయిగా దీన్ని పేర్కొంటారు. ఇప్పుడు మన దేశంలో సంతానోత్పత్తి రేటు (total fertility rate) అంతకంటే తక్కువగా ఉండటం వల్ల జనాభా తగ్గుదల మొదలైందని సర్వే చెబుతోంది. 1998-99లో సంతానోత్పత్తి రేటు 3.2గా ఉంది. అంటే అప్పట్లో సగటు భారతీయ మహిళ తన జీవితకాలంలో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చినట్లు. ఆ తర్వాత క్రమంగా ఇది తగ్గుతూ వస్తోంది.
2019-21లో ఐదు రాష్ట్రాలు-కేంద్రపాలిత ప్రాంతాల్లో మినహా మిగిలిన చోట్ల సంతానోత్పత్తి రేటు 2 అంతకంటే తక్కువగానే ఉంది. బిహార్, ఝార్ఖండ్, ఉత్తర్‌ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, మణిపుర్‌లో మాత్రం ఇది ఇంకా రీప్లేస్‌మెంట్ స్థాయి కంటే ఎక్కువగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది.