National emblem controversy: జాతీయ చిహ్నానికి సంబంధించి ఇచ్చిన డిజైన్లలో తాను మార్పులేవీ చేయలేదని స్పష్టం చేశారు నిర్మాణ రూపశిల్పి లక్ష్మణ్ వ్యాస్. టాటా కంపెనీ మట్టి నమూనాను చేసి ఇవ్వగా.. దానికి అనుగుణంగానే జైపుర్‌లో తాము కాంస్య విగ్రహం తయారుచేశామని తెలిపారు. ఈ మేరకు ఈటీవీ భారత్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇటాలియన్ మైనపు పద్ధతిలో చిహ్నాన్ని డిజైన్ చేశామని.. అందులో ఎలాంటి పొరపాట్లకు తావు ఉండదని స్పష్టం చేశారు.
పార్లమెంటు నూతన భవనంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఆవిష్కరించిన జాతీయ చిహ్నం రూపురేఖలపై తీవ్ర దుమారం చెలరేగిన నేపథ్యంలో లక్ష్మణ్ వ్యాస్ స్పందించారు. సారనాథ్‌లోని అశోక స్తంభంతో తాజా నిర్మాణానికి చాలా తేడాలున్నాయంటూ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ సహా పలు ప్రతిపక్ష పార్టీల నేతలు, పౌర సమాజంలోని కొన్ని వర్గాలవారు మండిపడ్డారు. ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున విమర్శలు గుప్పించారు. నూతన నిర్మాణంలో అవసరమైన మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. సారనాథ్ స్తూపంలోని సింహాలు ఆకర్షణీయంగా, గంభీర వదనాన్ని కలిగి ఉండగా.. మోదీ ఆవిష్కరించిన జాతీయ చిహ్నంలోని మృగరాజులు రౌద్రంగా కోరలు చాచి క్రూరంగా కనిపిస్తున్నాయని వారు ఆక్షేపించారు.
అశోక స్తంభంలోని సింహాల రూపాలు, గుణగణాలను మార్చడమంటే జాతీయ చిహ్నాన్ని అవమానించడమేనని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ట్విటర్‌లో పేర్కొన్నారు. నూతన పార్లమెంటుపై నిర్మాణాన్ని చూస్తే.. 'సత్యమేవ జయతే' నుంచి 'సింహమేవ జయతే'లా పరిస్థితులు మారినట్లు కనిపిస్తున్నాయని తృణమూల్ నేత మహువా మొయిత్రా వ్యంగ్యాస్త్రం సంధించారు. 'గాంధీ నుంచి గాడ్సే వరకు' అని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఈ వ్యవహారంపై ట్వీట్ చేశారు.