దేశంలో ప్రస్తుత కరోనా కల్లోలాన్ని, రోజువారీ కేసుల సంఖ్యను కేంద్రం ఏర్పాటుచేసిన ప్రత్యేక కమిటీ ముందే అంచనా వేసింది. సకాలంలో నివారణ చర్యలు తీసుకోకుంటే.. వైరస్ రెండో దశలో విలయం సృష్టిస్తుందంటూ మార్చి 9నే కేంద్రాన్ని హెచ్చరించింది. మే నెల ప్రారంభానికి రోజువారీ కేసులు 3.8 లక్షల నుంచి 4.4 లక్షలకు చేరుకుంటాయని ఆనాడే చెప్పింది. మే మధ్యకాలానికి క్రియాశీల కేసుల సంఖ్య 33-35 లక్షలకు చేరుతాయని అంచనా వేసింది. అయితే.. కేంద్రం ఈ విషయాన్ని పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదని ఇప్పుడు స్పష్టమవుతోంది. రెండో దశ వ్యాప్తిని కొట్టిపారేసే తరహాలోనే వ్యవహరించింది.
కరోనా నియంత్రణకు మార్గదర్శకాలు రూపొందించేందుకు కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం.. ఈ ఏడాది ప్రారంభంలోనే ఏడుగురు నిపుణులతో 'నేషనల్ కొవిడ్-19 సూపర్ మోడల్ కమిటీ'ని నియమించింది. ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ ఎం.విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కమిటీలో ఐఐటీ ఖరగ్‌పుర్ ప్రొఫెసర్ ఎం.అగర్వాల్, వెల్లూర్ క్రిస్టియన్ మెడికల్ కాలేజీ వైరాలజీ ప్రొఫెసర్ గగన్‌దీప్ కాంగ్ తదితరులున్నారు. ఈ కమిటీ ఇప్పటికే మనుగడలో ఉంది. రెండో దశ వ్యాప్తిపై మార్చి 9న ఈ కమిటీ కేంద్రాన్ని అప్రమత్తం చేసింది. అప్పటికే.. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కేరళలో రెండో దశ ప్రారంభమైందని, తక్షణమే నివారణ చర్యలు తీసుకోకుంటే దేశవ్యాప్తమవుతుందని హెచ్చరించింది. మే నాటికి రోజువారీ కేసులు 4 లక్షలకు చేరుతాయని సరిగ్గానే లెక్కకట్టింది. అయితే.. హరిద్వార్‌లో జరిగిన కుంభమేళా, 4 రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన ఎన్నికలకు కరోనా రెండోదశ వ్యాప్తికి సంబంధం ఉంటుందని ఆ కమిటీ చెప్పలేదు.
ఇదీ చదవండి:నేటి నుంచే '18 ప్లస్'కు టీకా.. కొన్ని రాష్ట్రాల్లోనే!