తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Azadi ka amrit mahotsav: 'జనగణమన'లో ఎవరా అధినాయక?

National Anthem Controversy: జనగణమన అధినాయక జయహే... అంటూ వీనుల విందు చేసే మన జాతీయగీతాన్ని తొలిసారి ఆలపించింది ఈ రోజే (27 డిసెంబరు)! బ్రిటన్‌ రాజు కింగ్‌ జార్జ్‌-5 రాక సందర్భంగా... 1911లో కోల్‌కతాలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ మహాసభలో ఈ గేయాన్ని పాడారు. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ రాసిన ఈ గేయంలోని పంక్తులపై, పదాలపై వివాదం నాటి నుంచీ సాగుతూనే ఉంది. ఇంతకూ జనగణమనలోని అధినాయకుడెవరు? భారత భాగ్య విధాత ఎవరు?

By

Published : Dec 27, 2021, 6:50 AM IST

jana gana mana
national anthem controversy

National anthem controversy lyrics: 1905లో చేసిన బెంగాల్‌ విభజనను 1911లో బ్రిటిష్‌ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. భారత ప్రజల ఆందోళనకు ఆంగ్లేయులు తలొగ్గి... మనసు మార్చుకున్న తొలి సంఘటన అది. అదే సమయంలో... బ్రిటన్‌ రాజు కింగ్‌ జార్జ్‌-5 భారత పర్యటనకు రావటంతో... రెండింటినీ కలిపి... కృతజ్ఞత తెలపటానికి కాంగ్రెస్‌ పార్టీ కోల్‌కతాలో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా రెండు పాటల్ని ఆలపించారు. ఒకటి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ సంస్కృత-బెంగాలీ పదాలతో రాసిన జనగణమన. రెండోది... జార్జ్‌-5ను కీర్తిస్తూ... రాంభుజ్‌ చౌధరి రాసిన గేయం. అనంతరం... బ్రిటిష్‌ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్‌ సభ తీర్మానాన్ని ఆమోదించింది.

Azadi ka amrit mahotsav

మరుసటి రోజు... ఆంగ్లేయుల పక్షాన నిలిచే అప్పటి ఇంగ్లిష్‌ పత్రికల్లో... 'కింగ్‌ జార్జ్‌ను కీర్తిస్తూ రవీంద్రుడు రాసిన గేయాన్ని కాంగ్రెస్‌ సభలో ఆలపించారం'టూ రాయటంతో అయోమయం చోటుచేసుకుంది. దీన్ని రవీంద్రుడు తోసిపుచ్చినా వివాదం, విమర్శలు కొనసాగుతూనే వచ్చాయి. "ఇలాంటి విమర్శలకు జవాబు చెప్పటమంటే... నన్ను నేను దిగజార్చుకున్నట్లే. బ్రిటిష్‌ను కీర్తించే పిచ్చిపని నేనెలా చేస్తా?" అంటూ బాధపడ్డ ఠాగూర్‌... తర్వాత సంపాదకుడు పులిన్‌ బెహారికి రాసిన లేఖలో అసలేం జరిగిందో వివరించారు. బ్రిటిష్‌ రాజును కీర్తించే పిచ్చిపని తాను చేయలేనని రవీంద్రుడు ప్రత్యక్షంగా, పరోక్షంగా స్పష్టీకరించారు.

1911 congress session jana gana mana

"బ్రిటిష్‌ ప్రభుత్వంలో పనిచేసే స్నేహితుడొకరు... బెంగాల్‌ విభజన రద్దుతో ఆనందం పట్టలేక... నా వద్దకు వచ్చి... కింగ్‌ జార్జ్‌ను కీర్తిస్తూ రాయమని కోరారు. అది నాకెంతో ఆశ్చర్యంతో పాటు ఆగ్రహం తెప్పించింది. యుగయుగాలుగా జార్జ్‌-5, జార్జ్‌-6, జార్జ్‌-7... ఇలా ఎంతటి శక్తిగల రాజులు వచ్చినా మానవ విధాతలు కాలేరు. భారతావని భాగ్యచక్రాన్ని నడిపించే అధినాయకుడు ... అందరి శుభాలను కోరే వాడే తప్ప ఏ రాజూ కాడు... కాలేడు."

-ఠాగూర్

జాతీయగీతంగా నేతాజీ ప్రకటన

ఇందులోని అధినాయక... భాగ్యవిధాత... అనే పదాలను ఎవరికి వీలైనట్లు వారు అనువర్తింపజేసుకునే వీలుండటంతో వివాదం కొనసాగుతూ వచ్చింది. అనుమానాలు, వివాదాలెలా ఉన్నా... జనగణమన ప్రజల నోళ్లలో నానటం ఆరంభమైంది. 1912లో బ్రహ్మసమాజ్‌ వ్యవస్థాపక దినోత్సవంలో కూడా జనగణమనను పాడారు. 1937లో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ తొలిసారిగా... ఆ గీతాన్ని భారత జాతీయగీతంగా ప్రకటించారు. 1942 సెప్టెంబరు 11న హాంబర్గ్‌లో జరిగిన ఆజాద్‌ హింద్‌ ఫౌండేషన్‌ సమావేశంలో... దీన్ని ఆలపించారు. హాంబర్గ్‌ రేడియోలో భారత జాతీయగీతంగా దీన్ని ప్రసారం చేశారు కూడా. ఆజాదీ హింద్‌ ఫౌజ్‌ కెప్టెన్‌ అబిద్‌ హసన్‌ సఫ్రాని దీన్ని 'శుభ్‌ సుఖ్‌ చెయిన్‌...' అంటూ హిందీలోకి అనువదించారు. ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లెలో అనిబీసెంట్‌ స్థాపించిన దివ్యజ్ఞాన కళాశాలకు వచ్చిన ఠాగూర్‌... అక్కడే జనగణమనకు ఆంగ్ల అనువాదం చేశారు. కళాశాలలో సంగీత ఉపాధ్యాయురాలు మార్గరెట్‌ కజిన్స్‌ బాణీ కట్టి... విద్యార్థులతో ఆలపింపజేశారు.

స్వాతంత్య్రం వచ్చాక... విదేశాల నుంచి భారత జాతీయగీతం ఏంటనే ప్రశ్న తలెత్తింది. అధికారిక సమావేశాల్లో ఆయా దేశాల జాతీయ గీతాన్ని ఆలపించటం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో భారత జాతీయ గీతంపై తక్షణమే నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉత్పన్నమైంది. వందేమాతరానికి, జనగణమనకు మధ్య పోటీలాంటి వాతావరణం ఏర్పడింది. అన్ని రాష్ట్రాలను సంప్రదించిన ప్రధాని నెహ్రూ... జనగణమనకే ఓటు వేశారు. 1950 జనవరి 24న కేంద్ర ప్రభుత్వం జనగణమనను జాతీయగీతంగా ప్రకటించింది. అయితే ఈ ప్రకటనకు ముందు... అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ... సంగీత విద్వాంసుడు హెర్బర్ట్‌ మురిల్‌కు దీన్ని వినిపించి అభిప్రాయం కోరారు. బాణీ మరీ నెమ్మదిగా సాగుతోందని భావించిన మురిల్‌... టెంపోను కాస్త పెంచారు. అలా స్వల్ప సంగీత మార్పులతో రవీంద్రుడి జనగణమన జాతీయగీతంగా అలరారుతోంది.

ఇదీ చదవండి:ఇండో-పాక్ సరిహద్దుల్లో రూ.200 కోట్ల డ్రగ్స్​ స్వాధీనం!

ABOUT THE AUTHOR

...view details