James Webb Discovered Existence of Dark Stars : ఈ విశ్వం అంతుచిక్కని రహస్యాల సమాహారం. భూమి నుంచి మొదలు ఆకాశం వరకు నిగూఢమైన అనేక అంశాలను ఈ విశ్వం తనలో నిక్షిప్తం చేసుకుంది. వాటి గుట్టు తెలుసుకునేందుకు మానవుడు నిరంతరం తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. అనేక కొత్త విషయాలను తెలుసుకుంటూనే ఉన్నాడు. అలాంటి మనిషికి అంతరిక్ష రహస్యాలను తెలుసుకునేందుకు లభించిన అద్భుత పరికరం జేమ్స్ వెబ్.
James Webb Space Telescope Latest News : అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తయారు చేసిన ఈ పరికరం గత ఏడాది జులై నుంచి నక్షత్రాలు, సుదూర గ్రహాల రహస్యాలను భూమికి చేరవేస్తోంది. ఇప్పటి వరకు కనీవిని ఎరుగని అంతరిక్ష రహస్యాలను అనేకం మనిషికి తెలియజేస్తోంది ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్. తాజాగా తొలిసారిగా కృష్ణ నక్షత్రాల ఉనికిని కూడా ఇది అందించిన సమాచారం ఆధారంగా శాస్త్రవేత్తలు సృష్టికి సంబంధించిన పరిశోధనలను మరింత విస్తృతం చేయడంపై దృష్టి సారించారు.
జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఒకటా రెండాజేమ్స్ వెబ్‌టెలిస్కోప్ పంపించిన అంతరిక్ష రహస్యాలు లెక్కకు మిక్కిలి. సాధారణంగా నక్షత్ర మండలం అంటే కోట్ల కొద్దీ చుక్కల సమాహారం. అలాంటి నక్షత్ర మండలాలు అయిదు ఒక్క చోటకు చేరితే ఆ దృశ్యం ఊహించుకుంటేనే అద్భుతంగా ఉంటుంది. ఆ అద్భుతాన్ని కళ్లకు కట్టింది జేమ్స్ వెబ్. ఈ అయిదు నక్షత్ర మండలాల సముదాయం పేరు స్టెఫాన్స్ క్వింటెట్. జేమ్స్‌వెబ్ పంపిన చిత్రాల ప్రకారం వీటిలో నాలుగు స్పష్టంగా కనిపిస్తుండగా, అయిదవది వీటి వెనకాల దాగి ఉంది.
James Webb Space Telescope : గురుత్వాకర్షణ శక్తి ప్రభావంతో ఇవన్నీ ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉన్నాయి. వీటి వెలుగులు 1,300 కోట్ల సంవత్సరాల క్రితం నాటివి. నక్షత్ర మండలాలు దగ్గరకు ఎలా చేరుకుంటాయి, ఎందుకు కలిసిపోతాయి అనే విషయాల గురించి అధ్యయనం చేసేందుకు స్టెఫాన్స్ క్వింటెట్ వంటి నక్షత్ర సముదాయాలు ఉపయోగపడతాయి. విశ్వం ప్రారంభంలో నక్షత్ర మండలాలు కలవడం సహజమే అని.. వీటి మూలంగానే మహా నక్షత్ర మండలాలు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తల భావన. ఇలాంటి అంతర నక్షత్ర మండలాల చర్యలే వాయువును అస్తవ్యస్తం చేసి నక్షత్రాల ఏర్పాటు, కృష్ణ బిలాల ఆవిర్భానికి కారణం అవుతుంటాయి.
జేమ్స్ వెబ్ పంపించిన మరో చిత్రం కాస్మిక్ క్లిప్స్. వీటిని అంతరిక్ష శిఖరాలు అని పిలుస్తుంటారు. భూమికి 7,500 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ అంతరిక్ష శిఖరాల వద్ద ఉన్న కెరెనా నెబుల్యాలోని వాయు మేఘం, ధూళి పైగి ఎగురుతున్న దృశ్యం అబ్బురపరుస్తుంది. భూమిపై కొండల తరహాలో కనిపిస్తుంది కాబట్టే వీటిని అంతరిక్ష శిఖరాలు అని పిలుస్తున్నారు. కొత్తగా ఏర్పడిన నక్షత్రాల నుంచి వెలువడే అతి నీలలోహిత కాంతి పుంజాలతో గాలి మేఘాలు చెదిరిపోవడం వల్ల ఈ ఆకారాలు రూపుదిద్దుకున్నాయి.
అంతరిక్ష శిఖరాల నుంచి వెలువడుతున్న ప్రవాహం తరహాలో కనిపిస్తున్నా.. వాస్తవానికి అది రేడియేషన్ కారణంగా పేలిపోయిన అయోనైజ్‌డ్ వాయువు, వేడి, దుమ్ముల సమాహారమే. ఈ ప్రాంతం గురించి శాస్త్రవేత్తలకు ముందే తెలిసినా జేమ్స్‌వెబ్ టెలిస్కోప్ సరికొత్త తరహాలో చూపించింది. గతంలో తయారు చేసిన హబుల్ టెలిస్కోప్‌ను తలదన్నే చిత్రాలను జేమ్స్ వెబ్‌అందిస్తోంది. హబుల్ గతంలో పంపిన సృష్టి స్తంభాల చిత్రం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరచగా, మరింత అబ్బురపరిచే చిత్రాలను ఈ టెలిస్కోప్ చిత్రీకరిస్తోంది.
ఈగల్ నెబుల్యాలో భాగమైన వాయు మేఘాలు నిట్టనిలువునా పైగి ఎగుస్తూ ఉండడం, వీటి ముందూ, వెనకా నక్షత్రాలు మిణుకు మిణుకుమంటూ ఉండడం అందినీ ఆకట్టుకుంది. జేమ్స్‌వెబ్ దీనిని మరింత ఆకర్షణీయంగా అందిస్తోంది. నెబ్యులా మేఘాల నిండా పరుచుకున్న చిన్నఎరుపు నక్షత్రాలను జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కళ్లకు కట్టినట్లు చిత్రీకరించింది. తమ అంతర్భాగంలో హైడ్రోజన్‌ను మండించేంత పెద్దగా లేకపోవడం వల్ల శాస్త్రవేత్తలు దీనికి ప్రోటోస్టార్స్ అని పిలుస్తున్నారు.
James Webb Discovered Existence of Dark Stars :దట్టమైన వాయు మేఘాలు, ధూళి వెనక దాగి ఉండడం వల్ల.. గతంలో ప్రయోగించిన హబుల్ టెలిస్కోప్ వీటి వెలుపలి అంచులను మాత్రమే చిత్రీకరించింది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ మాత్రం నెబ్యులాలో నక్షత్రాలు ఆవిర్భవించే ప్రాంతాన్ని స్పష్టంగా చిత్రీకరించింది. ఇది భూమికి 7,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. నక్షత్రాల ఏర్పాటును అధ్యయనం చేయడానికి శాస్త్రవేత్తలు ఈ ప్రాంతాన్ని ప్రయోగశాలగా భావిస్తుంటారు.
సాధారణంగా సౌర మండలాల అవతల ఉన్న గ్రహాలను గుర్తించడం చాలా కష్టం. ఇవి తమ నక్షత్రం నుంచి వెలువడే ప్రకాశవంతమైన కాంతి వల్ల మసకబారి ఉంటాయి. ఇలాంటి ఒక గ్రహం జాడను జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కనిపెట్టింది. ఈ గ్రహం పేరును హెచ్.ఐ.బి-65426-బీ. అతిథి నక్షత్రం నుంచి వెలువడే కాంతిని అడ్డుకునే కాంతి కోరోనాగ్రాఫ్ సాయంతో జేమ్స్ వెబ్ దీనిని గుర్తించింది. హెచ్.ఐ.బి-65426బీని మహా వాయుగ్రహంగా భావిస్తున్నారు. ఇది గురుగ్రహం కంటే 12 రెట్లు పెద్దది. భూమికి-సూర్యుడికి మధ్య ఉండే దూరం కంటే వంద రెట్లు ఎక్కువ దూరంతో తన నక్షత్రం చుట్టూ ఇది తిరుగుతూ ఉంటుంది. ఈ గ్రహ ఉపరితలం గట్టిగా లేకపోవడం వల్ల జీవం ఉండే అవకాశం లేకపోవచ్చు గాని, జేమ్స్ వెబ్ దీనిని చిత్రీకరించడం గొప్ప విషయమే.
జేమ్స్ వెబ్ టెలిస్కోప్ జేమ్స్ వెబ్‌టెలిస్కోప్ సాధించిన గొప్ప విజయాల్లో ఒకటి భూమి నుంచి వేలాది సంవత్సరాల దూరంలో నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాల వాతావరణానికి సంబంధించిన సమాచారాన్ని అందించడం. వీటిలో ఒకటి వాస్ప్-39బీ. ఇది భారీ వాయు గ్రహం. ఇది దాదాపు శనిగ్రహం అంత ద్రవ్యరాశిని కలిగి ఉంది. కాకపోతే తన నక్షత్రానికి చాలా దగ్గరి కక్ష్యలో తిరుగాడుతోంది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌లోని పరికరాల సహాయంతో శాస్త్రవేత్తలు దీని వాతావరణంలోని రసాయన తీరుతెన్నులను పరీక్షించారు. అక్కడ నీటి ఆవిరి, సల్ఫర్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సోడియం, పొటాషియం ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ నక్షత్రం నుంచి వెలువడే కాంతి గ్రహం వాతావరణంలోని నీటి అణువులను తాకుతోంది. గతంలో ఎప్పుడూ చూడని విధంగా జేమ్స్ వెబ్‌తోనే శాస్త్రవేత్తలు దీన్ని గుర్తించారు.
James Webb Discovered Existence of Dark Stars :జేమ్స్ వెబ్‌నక్షత్ర అలలను కూడా అద్భుతంగా చిత్రీకరించింది. వోల్ఫ్-రేయర్-డబ్ల్యూ.ఆర్-140 అనే నక్షత్రం ఉండే వాతావరణంలో అయోనైజ్డ్ హీలియం, నత్రజని, కార్బన్ ఉంటాయి. డబ్ల్యూ.ఆర్-140నక్షత్రం చుట్టూ వలయాలు ఉన్నాయి. చూడడానికి ఇది చిత్రకారులు గీసిన చిత్రంలా ఉండే ఈ వలయాలు అంతరిక్షంలో నిజంగా వెలసిన దృశ్యమే. వీటిని నక్షత్రం చుట్టూ ఉండే శంఖ పదార్థాలుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మొత్తం 17 ఇలాంటి వలయాలను శాస్త్రవేత్తలు గుర్తించారు.
జేమ్స్ వెబ్ తీసిన చిత్రాల్లో ప్రజల కోసం ఒకటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విడుదల చేశారు. హబుల్ టెలిస్కోప్ కంటే మరింత వేగంగా కేవలం 12 గంటల్లోనే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ దీన్ని చిత్రీకరించింది. ఇందులో ఎస్.ఎమ్.ఏ.సి.యస్-0723 అనే నక్షత్ర మండలాల సముదాయం ప్రధానంగా కనిపిస్తుంది. భూమికి 500 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలోని ఇందులో వేలాది నక్షత్ర మండలాలు ఇమిడి ఉన్నాయి.
దీనిలోని నక్షత్రాలు చాలా పురాతనమైనవి. వీటిలో పెద్ద మార్పులు కూడా జరగలేదు. దీన్ని మిణుగురు నక్షత్ర మండలంగానూ శాస్త్రవేత్తలు అభివర్ణించారు. దీని చుట్టూ మిణుగురుల తరహాలో ఉన్న ఎరుపు-పసుపు చుక్కలను గుర్తించడం జేమ్స్ వెబ్‌కే సాధ్యమైంది. నెలరోజుల్లోనే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అంతరిక్షంలో అంతుచిక్కని అనేక రహస్యాలను అందిస్తుండడం పట్ల శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో అంతరిక్ష పరిశోధనల్లో ఇది ఓ మైలురాయిగా నిలవగలదని వారు భావిస్తున్నారు.
ఇవీ చదవండి : 1.'చంద్రుడు చుట్టూ తిరిగొచ్చే వ్యోమగాములు వీరే.. ఆ ఇద్దరూ ప్రత్యేకం'
జేమ్స్ వెబ్ అద్భుతం.. బిగ్‌బ్యాంగ్ నాటి చిత్రాన్ని తీసిన టెలిస్కోప్