Haridwar Man Swachabharat Car: పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడమే ధ్యేయంగా హరిద్వార్‌కు చెందిన ఓ వ్యక్తి వినూత్న ప్రయత్నం చేస్తున్నాడు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో చెత్త పేరుకుపోవడం చూసి తన వంతుగా ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు. తన కారునే చెత్తను తరలించే వాహనంగా మలిచి కొన్ని సంవత్సరాలుగా చెత్తను సేకరిస్తున్నాడు.
2012లో హరిద్వార్ పట్టణంలో.. వ్యర్థాల సేకరణ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల చెత్త విపరీతంగా పేరుకుపోయేది. ఆ పరిస్థితులను గమనించిన 53 ఏళ్ల నరేశ్ గిరి.. పట్టణాన్ని శుభ్రంగా ఉంచడానికి ఏదైనా చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. తన దగ్గర ఉన్న మారుతీ-800 కారునే ఇందుకోసం ఉపయోగించాలనుకున్నాడు. కారులో వెనుక ఉండే రెండు సీట్లను తీసేశాడు. ఓ ప్లాస్టిక్ డ్రమ్మును సగానికి కట్ చేసి.. కారు సీట్ల స్థానంలో అమర్చాడు. కారుపైన జాతిపిత మహాత్మాగాంధీ, ప్రధాని మోదీ ఫొటోలను కూడా పెట్టుకున్నాడు. ప్రతిరోజూ పట్టణమంతా తిరిగి చెత్త సేకరిస్తున్నాడు నరేశ్. బహిరంగ ప్రదేశాల్లో చెత్త పారవేయడం పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాడు.