దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తోన్న రైతులతో చర్చించడాానికి కేంద్రం ఇప్పటికీ సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. త్వరలో ఎన్నికలు జరగనున్న అసోంలో గురువారం పర్యటించారు. ఈ సందర్బంగా విలేకరుల సమావేశం నిర్వహించారు.
చట్టాలపై నిబంధనలకు అనుగుణంగా చర్చించడానికి ప్రభుత్వం సుముఖంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటులో ప్రకటించారని తోమర్ గుర్తుచేశారు. రైతులతో చర్చలపై కేంద్రం సిద్ధంగా ఉందా అనే విలేకరుల ప్రశ్నకు ఈ విధంగా స్పందించారు. అయితే చర్చలు తిరిగి ఎప్పుడు ప్రారంభమయ్యేదీ ఆయన చెప్పలేదు.
''నిరసన తెలుపుతోన్న రైతులను క్రమం తప్పకుండా సంప్రదిస్తున్నాం. చట్టాల నిబంధనలపై చర్చించడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది. బడ్జెట్లో వ్యవసాయ రంగ శ్రేయస్సు కోసం అనేక పథకాలను ప్రతిపాదించాం.''
- నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర వ్యవసాయ మంత్రి