Narendra Modi Shirdi Visit Video :2014కు ముందు దేశంలో ఎక్కడ చూసినా అవినీతికి సంబంధించిన లెక్కలే వినిపించేవని, ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమ ప్రభుత్వం సబ్కా సాత్, సబ్కా వికాస్ మంత్రంతో పని చేస్తోందని మహారాష్ట్ర పర్యటనలో తెలిపారు. ప్రజల సంక్షేమమే డబుల్ఇంజిన్ సర్కారు ప్రాధాన్యమని వ్యాఖ్యానించారు. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్న నేపథ్యంలో.. పేదల సంక్షేమ బడ్జెట్ సైతం పెరుగుతోందని తెలిపారు.
"2014కు ముందు మీకు తరచుగా అంకెలు వినిపించేవి. అన్ని రూ.లక్షల స్కామ్ జరిగింది. ఇన్ని రూ.కోట్ల స్కామ్ జరిగిందని వినేవారు. ఇప్పుడేమైంది? పేదల కోసం వెచ్చించే బడ్జెట్ పెరుగుతోంది. మహారాష్ట్రలోనే 1.10 కోట్ల ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇచ్చాం. పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నాం. మనమందరం కలిసి 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కలసికట్టుగా పనిచేయాలి."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
మహారాష్ట్రలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అహ్మద్‌నగర్ జిల్లాలోని నిల్వండే డ్యామ్‌కు జల పూజలు చేసిన ఆయన.. ఆనకట్ట ఎడమ కాలువ నెట్‌వర్క్‌ను ప్రారంభించారు. 85 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఆనకట్ట ఎడమ కాలువ నెట్వర్క్ ద్వారా 182 గ్రామాలకు మంచి నీరు అందనుంది. నిల్వండే డ్యామ్ నిర్మాణానికి 1970లో ప్రతిపాదనలు చేసినట్లు అధికారులు తెలిపారు. రూ.5,177 కోట్ల వ్యయంతో డ్యామ్ నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు.