Narendra Modi On Artificial Intelligence : ఉగ్రవాదుల చేతుల్లో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-AI) పడితే ప్రపంచానికి పెద్ద ముప్పు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఈ టెక్నాలజీని ఉపయోగించి మానవ రహిత దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ ఇదే పరిస్థితులు ఎదురైతే వాటిని ఎలా ఎదుర్కోవాలన్నదానిపై వ్యూహాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. వివిధ అంతర్జాతీయ సమస్యల కోసం ఒప్పందాలు, ప్రోటోకాల్‌లు ఉన్నట్టే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైతిక ఉపయోగం కోసం గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించాలని ఆయన సూచించారు. దిల్లీలో నిర్వహించిన గ్లోబల్ పార్టనర్‌షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్‌లో మోదీ ప్రసంగించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 21వ శతాబ్దంలో అభివృద్ధికి అతిపెద్ద సాధనంగా మారుతుందని, నాశనం చేయడంలోనూ అంతే శక్తివంతంగా ఉంటుందని ప్రధాని హెచ్చరించారు.
"కృత్రిమ మేధ (ఏఐ) ప్రస్తుత, భవిష్యత్తు తరాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది. మనం చాలా జాగ్రత్తగా ముందుకు సాగాలి. ఈ శిఖరాగ్ర సమావేశం నుంచి వెలువడే సూచనలు, ఆలోచనలు ప్రపంచాన్ని ఏఐ చీకటి కోణాల వల్ల ఎదురయ్యే సంభావ్య ప్రమాదాలు, సవాళ్ల నుంచి రక్షించడంలో సహాయపడతాయని నేను నమ్ముతున్నాను. కృత్రిమమేధతోఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అదే స్థాయిలో నష్టాలు కూడా ఉండటం దురదృష్టకరం. 21వ శతాబ్దంలో మానవజాతికి సాయం చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓ అద్భుతమైన సాంకేతికత. అయితే, అది మనల్ని నాశనం చేయడంలోనూ కీలక పాత్ర పోషించగలదు. ఆ కోవకు చెందినదే డీప్‌ఫేక్."
--నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి