Narendra Modi No Confidence Motion : విపక్ష ఇండియా కూటమిలోని పరస్పర అపనమ్మకాన్ని అవిశ్వాస తీర్మానం ప్రతిబింబిస్తోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. తమ వెంట ఎవరున్నారు, ఎవరు లేరని వారిని వారే పరీక్షించుకుంటున్నారని తెలిపారు. కేంద్రానికి వ్యతిరేకంగా లోక్‌సభలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం చర్చ జరగనున్న నేపథ్యంలో.. దానిని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై చర్చించేందుకు అధికార భాజపా పార్లమెంటరీ కమిటీ సమావేశమైంది. దిల్లీలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సహా కేంద్రమంత్రులు, భాజపా ఎంపీలు పాల్గొన్నారు. ఇండియా కూటమిఆరోపణలను ఎలా తిప్పి కొట్టాలన్న దానిపై చర్చ జరిగింది. దాంతో పాటు ఎగువ సభలో దిల్లీ సర్వీస్ బిల్ ఆమోదం పొందటంపై బీజేపీ రాజ్యసభ సభ్యులను మోదీ అభినందించారు.
BJP Parliamentary Party Meeting Today : 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు రాజ్యసభలో జరిగిన 'దిల్లీ బిల్లు' ఓటింగ్‌ను సెమీఫైనల్‌గా కొందరు ప్రతిపక్ష సభ్యులు అభివర్ణించారన్న మోదీ.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ గెలుపుపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికలకు ముందు.. చివరి బంతిని సిక్సర్లు బాదాలని తమ పార్టీ ఎంపీలకు ఆయన సూచించారు. 'ప్రతిపక్ష నేతలు సామాజిక న్యాయం గురించి మాట్లాడతారు. కానీ వారి కుటుంబ, బుజ్జగింపు, అవినీతి రాజకీయాలే దేశానికి ప్రమాదం. దేశంలో వీటిని రూపుమాపాలి." అని మోదీ వ్యాఖ్యానించారు. తాము మూడవసారి చేపట్టే ప్రభుత్వంలో ఎంపీలు రైల్వే ప్రాజెక్ట్‌ల కోసం ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదన్నారు మోదీ. ప్రస్తుతం జరుగుతున్న రైల్వే అభివృద్ధి పనులపై ఆ శాఖ మంత్రి అశ్వీనీ వైష్ణవ్ ఇచ్చిన ప్రజెంటేషన్ ఆ విషయాన్ని ధృవీకరిస్తోందని తెలిపారు.