Narendra Modi Jan Aushadhi Kendras :సబ్సిడీ ధరలకు మందులను విక్రయించే జన్ ఔషధి కేంద్రాల సంఖ్యను 10,000 నుంచి 25,000కు పెంచే కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. దీంతో సాధారణ ప్రజలకు మరింత చౌకధరలకే మందులు లభిస్తాయని మోదీ అన్నారు. ఇదే కార్యక్రమంలో.. 'వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర' లబ్ధిదారులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు.
లబ్ధిదారులందరికీ ఈ పథకాల ప్రయోజనాలు సకాలంలో చేరేలా చూడడం ద్వారా ప్రభుత్వ పథకాలు పరిపూర్ణతను సాధిస్తాయని.. ఈ లక్ష్యంతోనే భారత్ సంకల్ప్ యాత్రను దేశవ్యాప్తంగా చేపట్టారని ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలో ఝార్ఖండ్‌లోని దేవ్‌గఢ్ ఎయిమ్స్‌లో ప్రారంభించిన 10,000వ జన్ ఔషధి కేంద్రాన్ని కూడా ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు.
'డ్రోన్ దీదీ యోజన' ప్రారంభం..!
మరోవైపు వ్యవసాయ ప్రయోజనాల కోసం రైతులకు డ్రోన్‌లు అద్దెకు ఇచ్చేందుకు ప్రవేశపెట్టిన 'డ్రోన్ దీదీ యోజన'ను కూడా గురువారం ప్రారంభించారు మోదీ. ఇందుకోసం 15,000 మహిళా స్వయం సహాయక బృందాలను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. 2024-25 నుంచి 2025-26 మధ్య కాలంలో వీరికి డ్రోన్లను అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని ప్రధాని అన్నారు.
గత 10 ఏళ్లుగా..
గత 10 ఏళ్లుగా తాను ప్రవేశపెడుతున్న పథకాలు, చేస్తున్న మంచి పనిని చూసి ప్రజలు తమ ప్రభుత్వంపై అపారమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నారని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. 'వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర' లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించిన అనంతరం ఈ మేరకు వ్యాఖ్యానించారు. అంతకుముందు ప్రభుత్వాలు తమను తాము పౌరుల 'మై-బాప్(నియంతగా)'గా భావించాయని.. ఓటు బ్యాంకును మాత్రమే దృష్టిలో ఉంచుకుని పనిచేశాయని ప్రతిపక్ష పార్టీలపై ఫైర్ అయ్యారు ప్రధాని మోదీ. 'నా దృష్టిలో నాలుగు పెద్ద కులాలు అంటే పేదలు, యువత, మహిళలు, రైతులు.. వీరి ఎదుగుదలే భారతదేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తుంది' అని మోదీ అన్నారు.