Narendra Modi Himachal Pradesh: దేశంలో విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యంలో 40 శాతం శిలాజేతర ఇంధనాల ద్వారానే చేపట్టాలనే లక్ష్యాన్ని గడువుకన్నా ముందుగానే సాధించామని తెలిపారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. శిలాజేతర ఇంధనాల ద్వారా విద్యుత్తు ఉత్పత్తిని 2030 నాటికి 40 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. అయితే, 2021లోనే దానిని సాధించామన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో పలు హైడ్రోపవర్ ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపన చేసిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
" 2030 నాటికి దేశంలో శిలాజేతర ఇంధనాల ద్వారా 40 శాతం విద్యుత్తు ఉత్పత్తిని చేపట్టాలని 2016లో లక్ష్యంగా పెట్టుకున్నాం. 2021 నవంబర్లోనే ఆ లక్ష్యాన్ని చేరుకోవటం ప్రతి భారతీయుడికి గర్వకారణం. పర్యావరణాన్ని కాపాడుకుంటూనే అభివృద్ధిలో దూసుకుపోతున్న భారత్‌పై ప్రపంచం మొత్తం ప్రశంసలు కురిపిస్తోంది. సౌర విద్యుత్తు, జల విద్యుత్తు, పవన విద్యుత్తు, గ్రీన్ హైడ్రో పవర్.. ఇలా ప్రతి పునరుత్పాదక ఇంధనాన్ని వినియోగించుకునేందుకు భారత్ కృషి చేస్తోంది."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.