Narendra Modi Flag Hoisting In Red Fort : దేశ 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్రమంత్రులు, సీజేఐ డీవై చంద్రచూడ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఎర్రకోట ప్రాంగణంలో భారత వాయసేన పూల వర్షం కురిపించింది.
మోదీకి స్వాగతం..
Independence Day 2023 Red Fort : అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ రాజ్‌ఘాట్‌కు చేరుకుని మహాత్మ గాంధీకి నివాళులర్పించారు. ఎర్రకోటకు చేరుకున్న మోదీకి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర సహాయ మంత్రి అజయ్ భట్, రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమనే స్వాగతం పలికారు. అనంతరం సైనికుల నుంచి ప్రధాని మోదీ గౌరవ వందనాన్ని స్వీకరించారు.
కాంగ్రెసేతర తొలి ప్రధాని మోదీయే..
పంద్రాగస్టు సందర్భంగా ఎర్రకోట నుంచి వరుసగా పదేళ్లు పతాకావిష్కరణ చేసిన కాంగ్రెసేతర పార్టీల ప్రధానుల్లోమంత్రుల్లో మొట్టమొదటి నేతగా నరేంద్ర మోదీ నిలిచారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు.. ఈ స్వాతంత్య్ర దినోత్సవంతో ముగిశాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజా భాగస్వామ్యం ఉండాలన్న భావనతో.. దేశం నలుమూలల నుంచి వివిధ వర్గాలకు చెందిన 1,800 మందిని ఈ వేడుకలకు ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించగా వారందరూ 77వ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్నారు. వారిలో 400 మంది సర్పంచులు, 250 మంది వ్యవసాయ ఉత్పాదక సంఘాల వారు, 50 మంది చొప్పున పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, పీఎం కౌశల్ వికాస్ యోజన లబ్ధిదారులు, సెంట్రల్ విస్టా, నూతన పార్లమెంటు భవన నిర్మాణ పనుల్లో పాల్గొన్న కార్మికులు, హర్‌ఘర్ జల్ యోజన నిర్మాణ కార్మికులు, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు, నర్సులు, మత్స్యకారులు వేడుకల్లో పాలుపంచుకున్నారు.