Narendra Modi Delhi Metro :దిల్లీలో విస్తరించిన ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ లైన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ద్వారకా సెక్టార్ 21 నుంచి యశోభూమి ద్వారకా సెక్టార్ 25 వరకు రెండు కిలోమీటర్ల పొడవున ఈ లైన్‌ను విస్తరించారు. మెట్రో లైన్ ప్రారంభం తర్వాత.. ప్రధాని అక్కడి ఉద్యోగులు, సిబ్బందితో కాసేపు మాట్లాడారు.
అంతకుముందు.. ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మోదీ.. మెట్రోలో ప్రయాణించి వచ్చారు. ధౌలా కువాన్ స్టేషన్‌లో మెట్రో ఎక్కిన ప్రధాని.. యశోభూమి ద్వారకా సెక్టార్ 25 స్టేషన్ చేరుకునే వరకు తోటి ప్రయాణికులతో మాట్లాడారు. మెట్రోలోని చిన్నారులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మోదీ 73వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఓ మహిళ ఆయనకు సంస్కృతంలో శుభాకాంక్షలు చెప్పారు.
యశోభూమిని జాతికి అంకితం చేసిన మోదీ..
Yashobhumi Dwarka Delhi : దిల్లీలోని ద్వారకాలో నిర్మించిన ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్-IICC ఫేజ్-1ను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. రూ. 5 వేల 400 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ అత్యానిధుక సముదాయానికి యశోభూమిగా నామకరణం చేశారు. ప్రారంభోత్సవం తర్వాత యశోభూమిలో పర్యటించిన మోదీ అక్కడ ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. తర్వాత చేతివృత్తుల కళాకారులతో ముచ్చటించారు. వారు తయారుచేసిన వస్తువులను ఆసక్తిగా పరిశీలించారు.