తెలంగాణ

telangana

'దీదీ సర్కార్​కు త్వరలోనే రామ్​ కార్డ్​'

By

Published : Feb 7, 2021, 5:17 PM IST

Updated : Feb 7, 2021, 5:49 PM IST

బంగాల్​లో వామపక్షాల పాలనకు మమతా బెనర్జీ పునర్జీవం పోశారని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. టీఎంసీ పాలనలో అవినీతి, నేరాలు, హింస పెరిగిపోయాయని ఆరోపించారు. తమ హక్కుల గురించి ప్రజలు ప్రశ్నిస్తే దీదీ విసుగు చెందుతున్నారని ధ్వజమెత్తారు. మమత ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేసిందని, ప్రజలు త్వరలోనే 'రామ్ కార్డు' చూపిస్తారని అన్నారు.

Narendra Modi addresses public rally in Haldiya
మోదీ

బంగాల్​లో దీదీ ప్రభుత్వం నుంచి ప్రజలు మమత(ప్రేమ)ను కోరుకున్నారని, అయితే వారికి క్రూరత్వం మాత్రమే లభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. వామపక్ష పాలనకు దీదీ తిరిగి ఆయువు పోశారని ఎద్దేవా చేశారు. లెఫ్ట్ హయాంలో ఉన్న అవినీతి, నేరాలు, హింస, ప్రజాస్వామ్యంపై దాడులకు దీదీ ప్రభుత్వంలో పునర్జీవం లభించిందని ఆరోపించారు.

హల్దియాలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న మోదీ.. హక్కుల గురించి ప్రజలు ప్రశ్నిస్తే.. దీదీ విసుగు చెందుతున్నారని ధ్వజమెత్తారు. భారత్​ మాతాకీ జై అనే నినాదాలు చేసినా మమత చికాకుపడతారని, కానీ దేశాన్ని కించపరిచేందుకు జరిగే కుట్రలపై స్పందించరని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"బంగాల్​లో పరివర్తనం(మార్పు) రాలేదు, వామపక్షాల పాలనకు పునర్జీవం లభించిందని దీదీ ప్రభుత్వం తొలి ఏడాదిలోనే స్పష్టమైంది. వానపక్షాల పునరుజ్జీవం అంటే అవినీతి, నేరాలు, హింస, ప్రజాస్వామ్యంపై దాడులే. దీదీ నుంచి ప్రజలు ప్రేమను కోరుకుంటే వారికి క్రూరత్వమే లభించింది."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

'రామ్ కార్డు చూపిస్తారు'

టీఎంసీ ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేసిందని మండిపడ్డారు మోదీ. అంపన్ తుపాను నేపథ్యంలో కేంద్రం అందించిన విపత్తు సాయాన్ని దీదీ దుర్వినియోగం చేశారని ఆరోపించారు. మమత తీరు వల్ల పీఎం కిసాన్ పథక లబ్ధిదారులు తమ ప్రయోజనాలను కోల్పోయారని అన్నారు. అధికార దుర్వినియోగంతో ప్రజానిధులను లూటీ చేశారని ఆరోపణలు గుప్పించారు. వీటన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే మమతకు ప్రజలు 'రామ్ కార్డు' చూపిస్తారని చెప్పారు.

వామపక్షాలు, కాంగ్రెస్​తో టీఎంసీ తెర వెనుక పొత్తుపెట్టుకుందని ఆరోపించారు మోదీ.

"టీఎంసీ వరుసగా తప్పుల మీద తప్పులు చేసింది. బంగాల్ ప్రజలు వీటిని గమనిస్తున్నారు. అత్త-మేనల్లుడి ప్రభుత్వాన్ని సాగనంపాలని నిశ్చయించుకున్నారు. చాలా త్వరలోనే టీఎంసీకి రామ్ కార్డును చూపిస్తారు. బంగాల్​లో టీఎంసీతోనే మన ప్రత్యక్ష పోరాటం. కానీ ఆ పార్టీకి ఉన్న మిత్ర పార్టీలతోనూ జాగ్రత్తగా ఉండాలి. వామపక్షాలు, కాంగ్రెస్, టీఎంసీ కలిసి తెరవెనుక జట్టుకట్టాయి. దిల్లీలో వీరంతా సమావేశమై రాజకీయాలు మాట్లాడుకుంటున్నారు. కేరళలోనూ కాంగ్రెస్, వామపక్షాలు కలిసి రాష్ట్రాన్ని చెరో ఐదేళ్లు లూటీ చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నాయి."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

బెంగాలీలో ప్రసంగం

హల్దియాలో తన ప్రసంగాన్ని బెంగాలీలో ప్రారంభించారు మోదీ. భారత్​తో పాటు ప్రపంచానికి దిశానిర్దేశం చేసే మహానుభావులకు జన్మనిచ్చిన బంగాల్​కు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు చెప్పారు. మెదినీపుర్​ను సందర్శించడం ఆశీర్వాదంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా హల్దియాలో భారత్ పెట్రోలియం నిర్మించిన ఎల్​పీజీ ఇంపోర్ట్ టెర్మినల్​ను ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు మోదీ. దోబీ-దుర్గాపుర్ సహజవనరుల గ్యాస్ పైప్​లైన్ సెక్షన్, ప్రధానమంత్రి ఉర్జ గంగ ప్రాజెక్టు సహా రాణిచక్​లోని నాలుగు లేన్ల రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కమ్ ఫ్లైఓవర్​ను సైతం మోదీ ప్రారంభించారు.

ఫ్లైఓవర్​ను ప్రారంభిస్తున్న మోదీ

ఉత్తరాఖండ్ ఘటనపై

ఉత్తరాఖండ్ విపత్తుపై హల్దియా సభలో మాట్లాడిన ప్రధాని.. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్, కేంద్ర హోంమంత్రి, ఎన్​డీఆర్​ఎఫ్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.

Last Updated : Feb 7, 2021, 5:49 PM IST

ABOUT THE AUTHOR

...view details