పుదుచ్చేరి అభివృద్ధిలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రధాని మోదీ విమర్శించారు. పుదుచ్చేరిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. మాజీ సీఎం నారాయణస్వామి లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. పుదుచ్చేరిలో అవినీతి మాత్రమే ఉందని, అభివృద్ధి మాత్రం లేదని ఆరోపించారు. ప్రభుత్వ అవినీతి గురించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలే బహిరంగంగా ఆరోపణలు చేశారని ఆయన గుర్తు చేశారు. తాను చాలా ఎన్నికలు చూశానని.. కానీ సిట్టింగ్లో ఉన్న ముఖ్యమంత్రికి టికెట్ ఇవ్వకపోవడం ఇదే తొలిసారని మోదీ ఎద్దేవా చేశారు.
'సీఎంకే టికెట్ దక్కని ఈ ఎన్నికలు ఎంతో ప్రత్యేకం' - modi rally puduccherry
ఈసారి జరగనున్న పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సీఎం నారాయణ స్వామికే టికెట్ దక్కలేదని ఎద్దేవా చేసారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ దారుణంగా విఫలమైందని విమర్శించారు.
"కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే బహిరంగంగా ప్రభుత్వ అవినీతి గురించి మాట్లాడుతున్నారు. అవినీతిలో మాజీ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు సంబంధం ఉందని ఆరోపిస్తున్నారు. నాకు రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది. నేను చాలా ఎన్నికలు చూశాను. కానీ పుదుచ్చేరి 2021ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవి. ఎందుకో తెలుసా! ఎందుకంటే ఇక్కడ సిట్టింగ్ ముఖ్యమంత్రికి టికెట్ ఇవ్వలేదు. చాలా ఏళ్లు నమ్మకంగా ఉన్నా.. తమ అగ్రనేతలను ప్రసన్నం చేసుకునేందుకు తప్పుడు అనువాదాలు చేసినా.. ఆయనకు టికెట్ దక్కలేదు."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.