ఎంపీ రఘురామపై సీఐడీ చిత్రహింస ఘటనలో కీలక మలుపు MP Raghurama Custodial Torture Case Updates: ఏపీ సీఐడీ పోలీసులు తనను అక్రమంగా అరెస్ట్ చేసి, 2021 మే 14న కస్టడీలో చిత్రహింసకు గురి చేసిన ఘటనపై హైకోర్టు పర్యవేక్షణలో సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందంతో దర్యాప్తు చేయించాలని కోరుతూ.. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు. దర్యాప్తులో వెల్లడైన ఫలితం ఆధారంగా బాధ్యులపై సంబంధిత న్యాయస్థానంలో క్రిమినల్ చర్యలు ప్రారంభించేలా ఆదేశించాలని అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంలో అనుబంధ పిటిషన్ దాఖలు చేస్తూ సీఐడీ అధికారులతో పాటు మరో ఇద్దరు వైసీపీ నేతల కాల్ డేటాను భద్రపరిచేలా సీబీఐని ఆదేశించాలని కోరారు.
తనను హింసకు గురి చేసిన రోజు సీఐడీ కార్యాలయం సమీపంలో ప్రస్తుత మంత్రి, అప్పటి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి నుంచి వచ్చే సూచనలు సీఐడీ అధికారులకు చేరవేసేలా వ్యవహరించారన్నారు. ఈ నేపథ్యంలో వారి కాల్‌డేటా, సాంకేతిక ఆధారాలు, గూగుల్ టేక్ అవుట్ వివరాలను భద్రపరచాలని కోరారు. తాజాగా జరిగిన విచారణలో ఎంపీ తరపున న్యాయవాది కర్లపాలెం నౌమీన్ వాదనలు వినిపించారు. కాల్ డేటాను భద్రపరిచేలా సీబీఐని ఆదేశించాలని కోరారు. న్యాయస్థానం సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తే ఆ వివరాలు సహాయపడతాయన్నారు.
గతంలో కాల్ డేటాను ఏడాది మాత్రమే భద్రపరిచేవారని సీబీఐ తరపున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ హరినాథ్ వాదించారు. 2021 డిసెంబర్ 21న కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తూ రెండేళ్ల పాటు డేటాను భద్రపరచాలని టెలికం సర్వీసు ప్రొవైడర్లకు స్పష్టం చేసిందన్నారు. పిటిషనర్‌ను చిత్రహింసలకు గురిచేసిన ఘటన ఆరోపణ 2021 మే 14న జరిగిందన్నారు. డేటా లభ్యతపై సందేహం వ్యక్తం చేశారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. డేటా లభ్యంగా ఉంటే భద్రపరచాలని స్పష్టం చేశారు.
2021 మే 14నుంచి 16వ తేదీ మధ్య మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, సీఐడీ అప్పటి డీజీ సునీల్‌కుమార్, డీఐజీ సునీల్ నాయక్, సీఐడీ డీఎస్పీ విజయ్‌పాల్, సీఐడీ అధికారులు ఉమామహేశ్వరావు, పసుపులేటి సుబ్బారావు, సుబ్రహ్మణ్యంల కాల్‌డేటాను భద్రపరచాలని ఆదేశించారు. ఈ కేసు దర్యాప్తును భవిష్యత్తులో సీబీఐకి అప్పగిస్తే.. ఆ డేటా దర్యాప్తునకు ఉపయోగపడుతుందన్నారు. డేటా అంతా తుడిచిపెట్టుకు పోయాక భవిష్యత్తులో సీబీఐకి దర్యాప్తు అప్పగించినా ప్రయోజనం ఏముంటుందన్నారు. పిటిషనర్ ఆందోళన కూడా అదేనన్నారు. మరోవైపు హోంశాఖ తరఫున న్యాయవాది చైతన్య, సీఐడీ తరపున శివకల్పనారెడ్డి వాదనలు వినిపించారు. వ్యాజ్యంలో అధికారులను ప్రతివాదులుగా చేర్చాలని ఇంప్లీడ్ దాఖలు చేసినట్లు హైకోర్టుకు తెలిపారు.
ఇవీ చదవండి