నారదా కుంభకోణం కేసులో(Narada case) సీబీఐ అరెస్టు చేసిన తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఎమ్మెల్యేలకు కోల్‌కతా హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. రూ. 2లక్షల బాండు, రెండు పూచీకత్తుల మీద వారికి బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడొద్దని తెలిపింది.
మంత్రులు ఫిర్హాద్ హకీం, సుబ్రతా ముఖర్జీ, ఎమ్మెల్యేలు మదన్ మిత్రా, సోవన్ ఛటర్జీలను సీబీఐ కొద్దిరోజుల కింద అరెస్టు చేసింది.
ఏమిటీ 'నారదా స్కాం'?
నారదా న్యూస్ పోర్టల్‌కు చెందిన మ్యాథ్యూ శామ్యూల్ 2014లో శూల శోధన (స్టింగ్ ఆపరేషన్) నిర్వహించారు. ఒక ఊహాజనిత కంపెనీకి లాభం చేకూర్చడానికి లంచాలు ఇస్తామని చెప్పగా.. అందుకు అప్పట్లో మంత్రులుగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ నాయకులు అంగీకరించారు. మంత్రి ఫిర్హాద్ హకీం రూ.5 లక్షలు తీసుకోవడానికి సుముఖత చూపారు. మంత్రి సుబ్రతా ముఖర్జీ, మదన్ మిత్ర(ఎమ్మెల్యే) రూ.5 లక్షల వంతున, సోవెన్ ఛటర్జీ(ఎమ్మెల్యే) రూ.4 లక్షలు, ఐపీఎస్ అధికారి ఎస్‌ఎంహెచ్ మీర్జా రూ.5 లక్షలు తీసుకుంటూ కెమెరాకు చిక్కారు.