Nara Lokesh Yuvagalam Padayatra: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రజలతో మమేకమై, వారి కష్టాల తెలుసుకుని, కన్నీళ్లు తుడుచేందుకు ఈ జనవరి 27న ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. చిత్తూరు జిల్లా కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారభించారు. 11 ఉమ్మడి జిల్లాలు, 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు, మున్సిపాలిటీలు, 2 వేల 28 గ్రామాల మీదుగా 226 రోజుల పాదయాత్ర చేశారు.
Special Story on Lokesh Yuvagalam Padayatra: నేడు పాదయాత్ర ముగించే సమయానికి లోకేశ్ మొత్తం 3 వేల 132 కిలోమీటర్లు నడవనున్నారు. కుప్పంలో పాదయాత్ర మొదలైనప్పటి నుంచి అడ్డుకునేందుకు, విచ్ఛిన్నం చేసేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కుట్రలు చేస్తూనే ఉంది. పోలీసుల్ని ప్రయోగించి, అవరోధాలు సృష్టించి, అక్రమ కేసులు పెట్టి నానా యాగీ చేసింది. చాలా చోట్ల వైఎస్సార్సీపీ నాయకులూ పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా లోకేశ్ మొక్కవోని దీక్షతో ముందుకు సాగారు.
3వేల కిమీ మైలు రాయిని అధిగమించిన యువగళం - పైలాన్ ఆవిష్కరణలో పాల్గొన్న బ్రాహ్మణి, మోక్షజ్ఞ, దేవాన్ష్
తొలి రోజుల్లో ఇలా: స్టాన్‌ఫోర్డ్ వంటి విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదువుకుని రాజకీయాల్లో ప్రవేశించిన లోకేశ్, తొలి రోజుల్లో పూర్తిగా పార్టీ సంస్థాగత నిర్మాణం, కార్యకర్తల సంక్షేమానికి సంబంధించిన వ్యవహారాలకు సమయం వెచ్చించారు. కార్యకర్తలకు బీమా వంటి కొత్త విధానాల రూపకల్పనలో క్రియాశీలంగా వ్యవహరించారు. ఎమ్మెల్సీగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజలని కలిసినప్పటికీ ఇంతగా మమేకమయ్యే అవకాశం ఆయనకు గతంలో ఎప్పుడూ రాలేదు.
అవే లోకేశ్‌ను నాయకుడిగా రాటుదేల్చాయి: మండుటెండ, జోరువాన, వణికించే చలిలోనూ నడిచి, ఒక నాయకుడిగా తన నుంచి ప్రజలు ఏమి ఆశిస్తున్నారో తెలుసుకునే అవకాశం లోకేశ్‌కు కలిగింది. నెలల తరబడి కుటుంబానికి దూరంగా రోడ్లపైనే ఉండటం, దుమ్ము ధూళిలో నడవడం, రోజూ వెయ్యి నుంచి పదిహేను వందల మంది పార్టీ నాయకుల్ని, కార్యర్తల్ని ప్రత్యక్షంగా కలవడం, వారు చెప్పిందంతా ఓపిగ్గా వినడం వంటివి లోకేశ్‌ని నాయకుడిగా మరింత రాటుదేల్చాయి.
ప్రజా సమస్యలు తెలుసుకుంటూ: పెద్ద పెద్ద గోతులు నిండిన రోడ్లు, కరవుతో బీళ్లుబారిన పొలాలు, భారీ వర్షాలకు నీట మునిగిన పంటలు, రైతన్న దైన్యం, కూలీల ఆవేదన, ఉపాధి లేక తల్లడిల్లుతున్న యువత, సమాజంలోని బలహీన వర్గాల బాధలు, దగాపడ్డ వర్గాల నైరాశ్యం ఇలా ప్రతి ఒక్కరి సమస్యల్ని తెలుసుకునేందుకు ఈ పాదయాత్ర ఒక వేదికైంది.
Lokesh Yuvagalam @ 2000: యువగళం పాదయాత్ర 2వేల కిలోమీటర్లు పూర్తి.. లోకేశ్‌ను అభినందించిన చంద్రబాబు
విరామం లేకుండా: నందమూరి తారకరత్న మరణం, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వంటి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప విరామం లేకుండా లోకేశ్ పాదయాత్ర కొనసాగించారు. అయితే సెప్టెంబరు 9న చంద్రబాబు అరెస్టుతో పాదయాత్రకు సుదీర్ఘ విరామం ఏర్పడింది. పార్టీ వ్యవహారాలతోపాటు, దిల్లీ వెళ్లి న్యాయవాదులతో సంప్రదించడం వంటి బాధ్యతల వల్ల ఆయన తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలో పొదలాడ వద్ద పాదయాత్రకు విరామం పలికారు. 79 రోజుల విరామం తర్వాత నవంబరు 27న మళ్లీ పొదలాడ నుంచే పాదయాత్రను పునఃప్రారంభించారు.
ఎన్ని అవరోధాలు సృష్టించినా వెనుకడుగే వేయకుండా: తొలుత జీవో నెం.1ని చూపించి ప్రభుత్వం పాదయాత్రకు అవరోధాలు సృష్టించింది. కుప్పంలో పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి తంబళ్లపల్లె నియోజకవర్గం వరకు పోలీసులు మొత్తం 25 కేసులు నమోదు చేయగా, వాటిలో మూడు లోకేశ్‌పై నమోదయ్యాయి. ప్రచార రథం, సౌండ్‌సిస్టమ్, మైక్, స్టూల్ సహా అన్నింటినీ సీజ్ చేశారు. పీలేరులో బాణసంచా కాల్చారని అక్కడి ఇంఛార్జి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి సహా పలువురిపై మూడు కేసులు నమోదు చేశారు.