Nara Lokesh Yuvagalam Padayatra: అణిచివేతకు గురైన వర్గాల గొంతుకే యువగళం అంటూ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పైలాన్ వద్ద తన సందేశాన్నిచ్చారు. ప్రజాగళమై, ప్రజలే బలమై 226 రోజులు, 3వేల132 కిలోమీటర్ల పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగిందని గుర్తుచేశారు.
ప్రతి హామీని నిలబెట్టుకుంటా: అసమర్థుడు గద్దెనెక్కి ప్రజాస్వామ్యంపై చేసిన దాడిని, వ్యవస్థల విధ్వంసాన్ని కళ్లారా చూశానని లోకేశ్ చెప్పారు. భవిష్యత్తుపై ఆశలు కోల్పోయిన యువతకు భరోసా ఇచ్చాననే విశ్వాసం వ్యక్తపరిచారు. అందరి సహకారంతో యువగళం పాదయాత్రను విజయవంతంగా గాజువాక నియోజకవర్గం అగనంపూడి వద్ద ముగిస్తున్నానన్నారు. పాదయాత్రలో తాను ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటానని తెలిపారు.
Nara Lokesh Yuvagalam Last Day: జనగళమే యువగళమై 226 రోజులపాటు అప్రతిహతంగా కొనసాగిన యువనేత నారా లోకేశ్ పాదయాత్ర దిగ్విజయంగా పూర్తయింది. కార్యకర్తలు, అభిమానుల జయజయధ్వానాల నడుమ గాజువాక ప్రకాష్ నగర్లో సోమవారం సాయంత్రం పాదయాత్ర విజయవంతమైనందుకు గుర్తుగా నారా లోకేశ్ పైలాన్‌ను ఆవిష్కరించారు.
అణిచివేతకు గురైన వర్గాలకు యువగళం గొంతుకైంది: నారా లోకేశ్
అభిమానుల కోలాహలం: గతంలో చంద్రబాబు చేపట్టిన వస్తున్న మీకోసం పాదయాత్ర ఎక్కడైతే ముగించారో అక్కడే యువగళం పాదయాత్రనూ లోకేశ్ ముగించారు. ఈ సందర్భంగా జై లోకేశ్, జై తెలుగుదేశం నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. ఉదయం విశాఖలోని ఉక్కునగరం సీడబ్యూసీ-1 ప్రాంతం నుంచి ప్రారంభమైన పాదయాత్ర కార్యకర్తలు, అభిమానుల కోలాహలం నడుమ ఉత్సాహంగా సాగింది.
అడుగడుగునా నీరాజనాలు: అడుగడుగునా ప్రజలు యువనేతకు నీరాజనాలు పట్టారు. లోకేశ్‌తో పాటు తల్లి నారా భువనేశ్వరి, అత్త నందమూరి వసుంధరాదేవి, ఇతర కుటుంబసభ్యులు కలిసి నడిచారు. యువగళం పాదయాత్రలో భాగస్వామ్యం అయిన ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సిబ్బంది అందరికీ పేరుపేరునా లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు.
యువగళం చివరిరోజైన 226వ రోజు యువనేత లోకేశ్ 13 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. మొత్తం 226 రోజుల్లో 3132 కి.మీ.ల మేర సాగిన యువగళం పాదయాత్ర అరాచకపాలనపై ప్రజలను చైతన్యవంతం చేయడంలో సంపూర్ణంగా విజయం సాధించింది. మరికొద్దినెలల్లో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చాటుతుందనేందుకు యువగళం పాదయాత్ర పునాది వేసింది.